ఇబ్బంది పెట్టే అధికారుల కోసం బ్లాక్‌బుక్‌ సిద్ధం: భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

కొందరు అధికారులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అటువంటి అధికారుల కోసం బ్లాక్‌బుక్‌ సిద్ధం చేశానని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.

Published : 24 Jun 2024 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొందరు అధికారులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అటువంటి అధికారుల కోసం బ్లాక్‌బుక్‌ సిద్ధం చేశానని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఐదేళ్ల తర్వాత భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అధికారులకు బ్లాక్‌డేస్‌ ఉంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, భారాస నేత మన్నె గోవర్ధన్‌రెడ్డిలతో కలిసి ఆదివారం కౌశిక్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారు. ప్రశ్నిస్తే మాపై ఎదురుదాడి చేస్తున్నారు. భారాస ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ పాటించడంలేదు. కల్యాణలక్ష్మి చెక్కులను మాకు తెలియకుండా పంపిణీ చేస్తున్నారు. ఎమ్మార్వోలకు స్వయంగా లెటర్‌ రాసినా.. మంత్రి రావాలని చెక్కులను ఆపుతున్నారు. అధికారులు ప్రొటోకాల్‌ ప్రకారం చెక్కులు పంచకపోతే హైకోర్టుకు వెళ్తా. పొన్నం ప్రభాకర్‌ పంపించిన నోటీసులకు మా లీగల్‌ టీమ్‌ సమాధానం చెబుతుంది. ఫ్లైయాష్‌ రవాణాలో పొన్నం ప్రభాకర్‌ డబ్బులు తీసుకోకపోతే బుధవారం తిరుమల వేెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రమాణానికి సిద్ధమా? పార్టీ మారిన ఎమ్మెల్యేల లొసుగులన్నీ బయటపెడతాం. నా నియోజకవర్గంలో నరేంద్రమోదీ, రేవంత్‌రెడ్డి, పొన్నంప్రభాకర్‌లు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించి, ఆహ్వానిస్తే.. నేను ఎమ్మెల్యేగా తప్పకుండా హాజరవుతా’’ అని కౌశిక్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని