అధైర్యపడొద్దు.. ప్రజల పక్షాన నిలబడండి

ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజల పక్షాన నిలవాలని.. పార్టీలు మారడం, కొత్తవారు చేరడం సహజమని ఎవరూ అధైర్యపడొద్దని అన్నింటిని తట్టుకొని పార్టీలో నిలబడాలని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Published : 24 Jun 2024 04:09 IST

కరీంనగర్‌ నాయకులతో భారాస అధినేత కేసీఆర్‌

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజల పక్షాన నిలవాలని.. పార్టీలు మారడం, కొత్తవారు చేరడం సహజమని ఎవరూ అధైర్యపడొద్దని అన్నింటిని తట్టుకొని పార్టీలో నిలబడాలని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్‌ వై.సునీల్‌రావు, భారాస కార్పొరేటర్లు, నాయకులు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావులను కలిశారు. కేసీఆర్‌ వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ సాధించడమే కాదు సుస్థిర పాలనను అందించింది కూడా భారాస ప్రభుత్వమే అని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత మాటలకు ఆకర్షితులై మనల్ని ఓడించారని, ఇప్పుడు ఆరు నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ఎలా ఉందో? వారికి అర్థమవుతుందన్నారు. భారాస ప్రతిపక్షంలో ఉండేలా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ను కలుద్దామనుకుంటే వీలు కాలేదని, తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్లు, మేయర్‌ సునీల్‌రావుతో కలిసి అధినేతను కలిసినట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌ను కలిసిన వారిలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, భారాస కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని