సంక్షిప్త వార్తలు (3)

లోక్‌సభలో జనసేన పక్షనేతగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నియమించారు.

Updated : 25 Jun 2024 06:08 IST

లోక్‌సభలో జనసేన పక్షనేతగా బాలశౌరి

ఈనాడు డిజిటల్, అమరావతి: లోక్‌సభలో జనసేన పక్షనేతగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నియమించారు. ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఇద్దరు ఎంపీలు బాలశౌరి, ఉదయ్‌శ్రీనివాస్‌ ఉన్నారు.


సింగరేణికి కేంద్రం నేరుగా గనులు కేటాయించాలి: కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థకు వేలంలో కాకుండా నేరుగా కేంద్రమే బొగ్గు గనులు కేటాయించాలని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్‌ చేశారు. ఆ దిశగా కేంద్రం స్పందించని పక్షంలో సింగరేణి పరిరక్షణ ఉద్యమం చేపట్టేందుకు వెనుకాడబోమన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సింగరేణి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. సంస్థతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.7 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతోంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ప్రైవేటీకరణతో రాదనే విషయాన్ని కేంద్రం గుర్తించాలి. మరోవైపు సంస్థ ఇప్పటికీ లాభాల్లోనే ఉంది. అలాంటి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం సిద్ధమైతే వ్యతిరేకిస్తాం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆ ప్రక్రియకు పూనుకోవద్దని విన్నవిస్తున్నాం. వేలంనుంచి  సింగరేణికి మినహాయింపు ఇవ్వాలి. తాడిచర్ల, కోయగూడెం గనులను అప్పగించాలి. ఆ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇస్తాం’’ అని కోదండరాం పేర్కొన్నారు. 


27న పార్లమెంట్‌ ముట్టడి యువజన కాంగ్రెస్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: ‘నీట్‌’ లీకేజీకి నిరసనగా ఈనెల 27న దిల్లీలో పార్లమెంట్‌ ముట్టడి చేపడతామని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. ఆ విభాగం రాష్ట్ర ఇన్‌ఛార్జి సురభి ద్వివేదితో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. భాజపా సర్కారు విద్యార్థులను ఇబ్బందులు పెట్టి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సురభి ద్వివేది మాట్లాడుతూ..ఎన్‌టీఏను నిషేధించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని