ఏపీ ఎంపీల్లో సీనియర్‌ మాగుంట

ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభ సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అత్యంత సీనియర్‌గా ఉన్నారు.

Published : 25 Jun 2024 03:04 IST

11 మందికి ఇదివరకు పనిచేసిన అనుభవం
14 మందికి ఇదే తొలి అడుగు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభ సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అత్యంత సీనియర్‌గా ఉన్నారు. ఆయన 1998, 2004, 2009, 2019, 2024ల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. కింజరాపు రామ్మోహన్‌నాయుడు (2014, 2019, 2024), దగ్గుబాటి పురందేశ్వరి (2004, 2009, 2024), వల్లభనేని బాలశౌరి (2004, 2019, 2024), పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి (2014, 2019, 2024) మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రమేష్‌ 2012 నుంచి 2024 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించి ఇప్పుడు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018 నుంచి 2024 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం లోక్‌సభకు ఎన్నికయ్యారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, మద్దిల గురుమూర్తి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. హిందూపురం ఎంపీ పార్థసారథి 1999 తర్వాత మళ్లీ ఇప్పుడు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 14 మంది తొలిసారి లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 25 మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. జనసేన తరఫున బాలశౌరి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన డీఎంకే, టీఎంసీ ఎంపీలు హే బాలా, పవన్‌కల్యాణ్‌ అంటూ నవ్వుతూ అరిచారు. ఇద్దరు ఎంపీలతో జనసేన తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని