కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు: కేటీఆర్‌

తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 25 Jun 2024 05:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కేటీఆర్‌ సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కాంగ్రెస్‌కు నా హెచ్చరిక. ఇలాంటి కష్టసమయాలు భారాసకు కొత్త కాదు. కాంగ్రెస్‌ పార్టీ నీతి లేని వ్యవహారాలపై తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఈ దెబ్బకు కాంగ్రెస్‌ తలవంచక తప్పదు. చరిత్ర పునరావృతం అవుతుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

నేతన్నలవి ప్రభుత్వ హత్యలే: సీఎం రేవంత్‌కు లేఖ

గత పదేళ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేతరంగం.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్‌ విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్‌ సర్కారు కక్షపూరిత వైఖరితో నేడు నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు పవర్‌ లూమ్స్‌ బంద్‌ అయ్యాయని ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఉపాధి లేక, ఆకలి బాధ తట్టుకోలేక చేనేత కార్మికులు తనువు చాలిస్తున్నారు. నేతన్నలవి ఆత్మహత్యలు కానే కావు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. పనులు కరవై ఇప్పటిదాకా పది మంది నేతన్నలు తనువు చాలించారు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రెేషియా అందించాలి’’ అని ఆ లేఖలో డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని