కోకాపేటలో భారాసకు ఇచ్చిన భూములు వేలం వేయాలి: షబ్బీర్‌ అలీ

కోకాపేటలో గత సర్కారు భారాస పార్టీ కార్యాలయానికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 25 Jun 2024 05:11 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: కోకాపేటలో గత సర్కారు భారాస పార్టీ కార్యాలయానికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారాస పార్టీ కార్యాలయానికి 11 ఎకరాల భూమి ఎందుకని ప్రశ్నించారు. ఆ భూములు వెనక్కి తీసుకొని వేలం వేసి, వచ్చిన డబ్బు రుణమాఫీకి వినియోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ పార్టీకి ఇప్పుడున్న కార్యాలయమే ఎక్కువ.. అది కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీస్‌ లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరికల మీద భారాస నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను భారాసలో చేర్చుకొని శాసనసభలో భట్టి విక్రమార్కకు, మండలిలో తనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది కేసీఆర్‌ కాదా? అని షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. సింగరేణి సంస్థను నిర్లక్ష్యం చేసిందే భారాస ప్రభుత్వమని, ఇప్పుడు దాని గురించి మాట్లాడే నైతికత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ, సింగరేణి కార్మికులకు శాశ్వత ఇళ్ల నిర్మాణంలో భారాస ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని