మీవే పిల్లచేష్టలు: అఖిలేశ్‌

‘‘పిల్ల చేష్టలు అని మాట్లాడేవారే పిల్ల చేష్టలు చేస్తుంటారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న నాయకుల గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని వారికి తెలియదు.

Published : 04 Jul 2024 03:50 IST

దిల్లీ: ‘‘పిల్ల చేష్టలు అని మాట్లాడేవారే పిల్ల చేష్టలు చేస్తుంటారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న నాయకుల గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని వారికి తెలియదు. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికీ ఎంతోమంది చేతకాని ‘పిల్లలు’ ఉన్నారు. వారు దేశ ప్రజల సమస్యలను అర్థం చేసుకోలేరు’’ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీవి పిల్లచేష్టలు అని మోదీ చేసిన వ్యాఖ్య నేపథ్యంలో బుధవారం ఆయన ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. నీట్‌పై ఎవరూ ప్రశ్నలు వేయకూడదనే ప్రధాని వేర్వేరు విషయాలన్నీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

నియంత ఎవరో ఇప్పుడు చెప్పండి: భాజపా

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నేపథ్యంలో మోదీ, విపక్ష నేత రాహుల్‌ లోక్‌సభలో వ్యవహరించిన తీరును చూపిస్తూ భాజపా కొన్ని దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. వీటిని చూస్తే నియంతలా ప్రవర్తించేది ఎవరో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. ‘‘రెండు విరుద్ధమైన దృశ్యాలివి. మొదటి వీడియోలో.. సభలో నిబంధనలు ఉల్లంఘించాలని, వెల్‌వైపు దూసుకెళ్లాలని, ప్రధాని ప్రసంగానికి ఆటంకం కలిగించాలని ఎంపీలకు రాహుల్‌ సూచిస్తున్నారు. ఇంకో వీడియోలో తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఎంపీకి ప్రధాని మోదీ తాగునీరు అందించారు. ఇక్కడ నియంత ఎవరు? అసలు రాహుల్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత ఉందా..?’’ అని భాజపా నేత షెహజాద్‌ పూనావాలా ప్రశ్నించారు. ఆయన పంచుకున్న ఒక వీడియోలో విపక్ష ఎంపీలకు రాహుల్‌ ఏవో సూచనలు చేయడం కనిపిస్తోంది. ఇంకో దాంట్లో ఒక ఎంపీకి మోదీ నీటి గ్లాసు అందించగా.. ఆ నేత వద్దంటూ తిరస్కరించారు. పక్కనే ఉన్న మరో విపక్ష ఎంపీ మాత్రం ఆ గ్లాసు తీసుకొని, మంచినీళ్లు తాగారు.

మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు: ఖర్గే

కాంగ్రెస్‌ ఒక పరాన్న జీవి అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’లో ఖండించారు. 2021లో రైతులు నిరసన చేపట్టినప్పుడు అదేమాట అన్నారని, మళ్లీ అదే మాట అంటూ తమను అవమానిస్తున్నారని ఆక్షేపించారు. మీతో ఒరిగిందేమీ లేదని మోదీ ప్రభుత్వానికి 140 కోట్ల మంది భారతీయులు ఈ ఎన్నికల్లో స్పష్టం చేశారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని