అగ్నివీరులకు పరిహారంపై రక్షణ మంత్రివి అసత్యాలే

పార్లమెంటు సాక్షిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అసత్యాలు చెప్పారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఆరోపించారు.

Published : 04 Jul 2024 03:51 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపణ
సామాజిక మాధ్యమంలో మృతుడి తండ్రి వీడియో పోస్ట్‌

దిల్లీ: పార్లమెంటు సాక్షిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అసత్యాలు చెప్పారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఆరోపించారు. అగ్నిపథ్‌ పథకం ద్వారా సైన్యంలో చేరిన అగ్నివీరులు విధి నిర్వహణలో చనిపోతే వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లిస్తున్నట్లు రక్షణ మంత్రి చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన అగ్నివీరుడు అజయ్‌ కుమార్‌ సింగ్‌ తండ్రి ఆ వీడియోలో మాట్లాడారు. ‘మృతి చెందిన అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి ఇచ్చినట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు. కానీ, అలాంటి సహాయం ఏదీ మా కుటుంబానికి అందలేదు. స్వల్పకాలానికి చేపట్టే అగ్నివీరుల నియామకాలను నిలిపివేసి సైన్యంలో రెగ్యులర్‌ నియామకాలను చేపట్టాల’ని అజయ్‌ తండ్రి ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు. 

రూ.98.39 లక్షలు అందించాం: ఆర్మీ

అగ్నివీరుడు అజయ్‌ కుమార్‌ సింగ్‌ కుటుంబానికి పరిహారం అందలేదంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న విమర్శలకు సైన్యం స్పందించింది. విధి నిర్వహణలో అసువులు బాసిన అజయ్‌కు పరిహారంగా అతని కుటుంబానికి మొత్తం రూ.1.65 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీకి చెందిన అడిషనల్‌ డైరెక్టొరేట్‌ జనరల్‌ కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా తెలిపింది. పోలీసుల వెరిఫికేషన్‌ తర్వాత మిగతా మొత్తం (సుమారు రూ.67 లక్షలు) కూడా చెల్లించనున్నట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని