రాజ్యాంగ వ్యతిరేకులు మీరే.. కాదు మీరే

రాజ్యాంగానికి అతిపెద్ద వ్యతిరేకి కాంగ్రెస్‌ పార్టీయేనని ప్రధాని మోదీ మరోసారి ధ్వజమెత్తారు. అలాంటి పార్టీ ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కల్లబొల్లిమాటలు చెబుతోందని విమర్శించారు.

Updated : 04 Jul 2024 04:29 IST

మోదీ, ఖర్గే పరస్పర ఆరోపణలు

దిల్లీ: రాజ్యాంగానికి అతిపెద్ద వ్యతిరేకి కాంగ్రెస్‌ పార్టీయేనని ప్రధాని మోదీ మరోసారి ధ్వజమెత్తారు. అలాంటి పార్టీ ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కల్లబొల్లిమాటలు చెబుతోందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం రాజ్యసభలో ఆయన సమాధానమిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడడం అనే అంశంపై ఎన్నికల్లో పోరాడినట్లు విపక్షం చెప్పడాన్ని తప్పుబట్టారు. ‘‘ఎమర్జెన్సీ విధించి, వాక్‌ స్వాతంత్య్రం సహా అనేక హక్కులను హరించిన అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిపక్షాలు మొట్టమొదటిసారిగా ఉమ్మడి పోరాటం చేశాయి. రాజ్యాంగ విషయాల్లో కాంగ్రెస్‌ది కపటబుద్ధి. ఎమర్జెన్సీ సమయంలో లోక్‌సభ పదవీకాలాన్ని ఏడేళ్లకు పెంచడం, జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేయడం దీనికి తార్కాణం. ఈ చర్యలకు రాజ్యాంగ ప్రాతిపదిక ఉందా? ఎప్పటినుంచో ఉన్న నియమాలను తుంగలోతొక్కి ఒకేఒక కుటుంబానికి ఆ పార్టీ పెద్దపీట వేసింది. రాజ్యాంగ విషయాల్లో పేలవమైన రికార్డు ఉన్న ఆ పార్టీతో మరికొన్ని పార్టీలు జత కట్టాయి. రాజ్యాంగ విలువలపై నిజమైన చిత్తశుద్ధితో కాకుండా రాజకీయ అవకాశవాదంతో అవి పొత్తు కుదుర్చుకున్నాయి’’ అని విమర్శించారు.

మణిపుర్‌పై రాజకీయాలు వద్దు 

మణిపుర్‌లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిపై రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు మోదీ హితవు పలికారు. అక్కడ ఇప్పటివరకు 500 మందిని పోలీసులు అరెస్టు చేశారని, హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో మణిపుర్‌లో పదిసార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తుచేశారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో నడిరోడ్డుపై ఓ మహిళను దారుణంగా కొట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఆ అన్యాయాన్ని అందరూ కళ్లప్పగించి చూశారే తప్ప, ఆ సోదరికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీనిపై విపక్షాలు మౌనంగా ఉన్నాయి. అఘాయిత్యాలపై ప్రతిపక్షాల వైఖరి ఆందోళన కలిగిస్తోంది’’ అని దుయ్యబట్టారు. 

అవును.. మాది మూడోవంతు ప్రభుత్వమే

‘‘మా పాలనపై ప్రజలు చూపిన విశ్వాసానికి గర్వంగా ఉంది. ఓటర్లు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి.. విభజన ఎజెండాను ఓడించారు. ఈ పరిణామాలతో కొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ కాంగ్రెస్‌ నేత మమ్మల్ని పదేపదే ‘మూడో వంతు ప్రభుత్వం’ అని విమర్శిస్తున్నారు. నిజమే. మేం పాలనలో పదేళ్లు పూర్తి చేసుకున్నాం. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటాం. అంటే మూడో వంతు ముగిసింది. రెండు వంతులు మిగిలింది’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘దర్యాప్తు సంస్థలకు ప్రభుత్వం పూర్తిస్వేచ్ఛ ఇచ్చింది. నల్లధనం పోగేసుకున్నవారిని.. అవినీతిపరులను వదిలే ప్రసక్తేలేదు. ఇది మోదీ గ్యారంటీ. దీనికి ఎన్నికల ఫలితాలతో సంబంధం లేదు. అవినీతిపరులపై చర్యల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. దర్యాప్తు సంస్థలు నిజాయతీతో పనిచేయాలి’’ అని చెప్పారు.

ఇలా వెళ్లిపోవడం సభకు అవమానం 

ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. నిరసనల నడుమే మోదీ ప్రసంగం కొనసాగించగా.. కొంతసేపటి తర్వాత విపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో మోదీ కొంతసేపు ప్రసంగాన్ని నిలిపివేశారు. తాను ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు వాకౌట్‌ చేయడాన్ని ప్రధాని ఖండించారు. ఒక కుటుంబాన్ని కాపాడడానికి దళితులు, బీసీలను బలిపశువుల్ని చేస్తున్నారన్నారు.


జీవితానికి మార్గదర్శకం రాజ్యాంగం: ధన్‌ఖడ్‌ 

విపక్షంపై రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘విపక్ష నేతలు సభను కాదు.. మర్యాదను విడిచి వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు. రాజ్యాంగంపై హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదు. రాజ్యాంగం అనేది కేవలం పుస్తకం కాదు. జీవితానికి మార్గదర్శకం’’ అని పేర్కొన్నారు. అనంతరం మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.ప్రధాని ప్రసంగం అనంతరం రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. 


ఆరెస్సెస్‌ ఎప్పుడూ రాజ్యాంగానికి వ్యతిరేకమే: ఖర్గే 

వాకౌట్‌ తర్వాత విపక్ష సభ్యులు సంవిధాన్‌ సదన్‌ ద్వారం వద్ద గుమిగూడారు. రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. ఆరెస్సెస్‌ ఎప్పుడూ రాజ్యాంగానికి వ్యతిరేకమేనని విమర్శించారు. సభకు ప్రధాని తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ‘రాజ్యాంగానికి అనుకూలురు ఎవరో, వ్యతిరేకులు ఎవరో తెలుసుకోవాలి. వ్యతిరేకుల్లో మోదీ ఒకరు. రాజ్యాంగంలో భారతీయత లేదంటూ ఆరెస్సెస్‌ 1950లోనే దానిని తిరస్కరించింది. అదే సంఘ్‌కు చెందిన భాజపా ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతోంది’ అని ఎద్దేవా చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు