ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజద.. విపక్షాన్ని తప్పుబట్టిన వైకాపా

లోక్‌సభతో పాటు తమ శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైకాపా, బిజూ జనతాదళ్‌ (బిజద) ఈసారి పార్లమెంటు సమావేశాల్లో భిన్న పోకడలను అనుసరించాయి.

Published : 04 Jul 2024 03:51 IST

దిల్లీ: లోక్‌సభతో పాటు తమ శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైకాపా, బిజూ జనతాదళ్‌ (బిజద) ఈసారి పార్లమెంటు సమావేశాల్లో భిన్న పోకడలను అనుసరించాయి. మునుపటి పార్లమెంటులో కీలకమైన బిల్లులకు ఆమోదం విషయంలో ఈ రెండు పార్టీలూ ఎన్డీయేకు మద్దతుగా నిలిచాయి. ఈసారి మాత్రం అధికార పక్షాన్ని విమర్శించడంలో ప్రతిపక్షంతో బిజద చేతులు కలిపింది. విపక్ష నిరసనలకు వైకాపా దూరంగా నిలిచి ప్రభుత్వంపై సానుభూతితో వ్యవహరించింది. ఎగువసభలో ఎన్డీయే కూటమికి తగినంత ఆధిక్యం లేకపోవడంతో ఈ రెండు పార్టీల వైఖరి- ఫలితాన్ని అటూఇటూ చేసే పరిస్థితి ఉంది. ఒడిశాకు ప్రత్యేక హోదాపై తాము ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్‌ గురించి రాష్ట్రపతి ప్రసంగంలో గానీ, ప్రధాని సమాధానంలో గానీ ఎలాంటి ప్రస్తావన లేదని, మోదీ ప్రసంగం మూసధోరణిలో ఉండడంతో సభలో కూర్చొని అర్థం లేదని భావించి బయటకు వచ్చామని బిజద ఎంపీ సస్మిత్‌ పాత్ర పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ మంగళవారం లోక్‌సభలో సమాధానం చెబుతున్నప్పుడు దానిని వినకుండా నిరసనలు తెలపాలని నిర్ణయించుకోవడాన్ని ఖండించాల్సిందేనని రాజ్యసభలో వైకాపా నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతులకు, దృష్టాంతాలకు తగినట్లుగా విపక్ష చర్య లేదని తప్పుపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని