జగన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం జాప్యం: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

జగన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.

Published : 04 Jul 2024 05:33 IST

తల్లిపేరిట మొక్కనాటి నీరుపోస్తున్న కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ 

ఈనాడు, దిల్లీ: జగన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. నాణ్యతలేని నిర్మాణాల వల్ల కాఫర్‌డ్యాం, డయాఫ్రంవాల్‌లను పునఃనిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వాటన్నింటినీ సరిదిద్ది కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తల్లి పేరుమీద ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఆయన దిల్లీలో తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో మొక్కను నాటారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘2014-19 మధ్య కాలంలో పోలవరం పనులు ముందుకు జరిగితే, 2019-24లో నత్తనడకన నడిచాయి. ఇప్పుడు ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై జలశక్తి మంత్రి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేకపోవడానికి గల కారణాలను ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అందులో ఇప్పటికీ మార్పులేదు’ అని స్పష్టం చేశారు. ఏపీలో గత అయిదేళ్లలో దెబ్బతిన్న శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి కొత్త ప్రభుత్వానికి 2, 3 నెలల సమయం పడుతుందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని