9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.3,480 కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

రాష్ట్రంలో సుమారు 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 04 Jul 2024 05:40 IST

తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజం 

ఈనాడు డిజిటల్, అమరావతి : రాష్ట్రంలో సుమారు 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. బోధనా రుసుములు, విద్యాదీవెన, వసతి దీవెన కింద చెల్లించాల్సిన దాదాపు రూ.3,480 కోట్ల నిధులను బకాయిపెట్టారని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో అస్మదీయ కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు చెల్లించినప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన గుర్తుకు రాలేదా అని జగన్‌ను నిలదీశారు. కాంట్రాక్టర్లపై ఉన్న శ్రద్ధలో కొంచెం కూడా పేద విద్యార్థులపై లేదని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ‘మూడు నెలలకోసారి కళాశాలలకు బోధన రుసుములు చెల్లిస్తామని గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫీజులు మాత్రం చెల్లించలేదు. పైగా ఆ తర్వాత ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు చేయనక్కర్లేదని...ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే చెల్లిస్తామని గతంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో చెప్పించారు’ అని విజయ్‌కుమార్‌ వెల్లడించారు. గత ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్థులు అప్పులు చేసి ఫీజులు కట్టారని విజయ్‌కుమార్‌ తెలిపారు. ‘2023-24 విద్యా సంవత్సరంలో ఒక్క త్రైమాసిక  నిధులే విడుదల చేశారు. ఆ నగదు నేటికీ తల్లుల ఖాతాలో పడలేదు’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని