పోలవరం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని సీపీఎం స్వాగతించింది. ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఈ భేటీలో రాష్ట్ర విభజన సందర్భంగా అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు.

Published : 05 Jul 2024 04:16 IST

విలీన గ్రామాల్ని భద్రాచలంలో కలపాలి 
సీఎం రేవంత్‌రెడ్డికి తమ్మినేని లేఖ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని సీపీఎం స్వాగతించింది. ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఈ భేటీలో రాష్ట్ర విభజన సందర్భంగా అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఆరు అంశాలతో ముఖ్యమంత్రికి గురువారం లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామాలను భద్రాచలంలో కలిపేలా చర్యలు తీసుకోవాలి. భద్రాచలం చుట్టూ ఏపీ రాష్ట్రం కావడంతో కనీసం డంపింగ్‌ యార్డుకూ చోటులేదు. పోలవరం బ్యాక్‌వాటర్‌ సమస్యతో భద్రాచలం, బూర్గంపాడు మండలాలతో పాటు ఇతర ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలి. విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తుకేంద్రం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, సింగరేణికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. దశాబ్దకాలంలో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించేలా చూడాలి. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి. ఇరురాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగానే వున్నాయి. వాటిని పరిష్కరించాలి’ అని లేఖలో తమ్మినేని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని