సంక్షిప్త వార్తలు (5)

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు.

Updated : 05 Jul 2024 06:39 IST

హైదరాబాద్‌లోని ఆస్తులు తెలంగాణకే చెందాలి 
మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి

హైదరాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ఆస్తుల పంపకాలపై చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. ప్రధానంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కృష్ణా బేసిన్‌ సమస్య పరిష్కరించకుండా పెన్నా బేసిన్‌ని తీసుకువెళ్తామని ఏపీ అనడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణకే చెందాలని అభిప్రాయపడ్డారు.


తెజసలో చేరిన ముదిరాజ్‌ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ముదిరాజ్‌ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గుండ్లపల్లి శ్రీనివాస్‌ ముదిరాజ్‌ గురువారం తెజసలో చేరారు. హైదరాబాద్‌లోని తెజస ప్రధాన కార్యాలయంలో ఆచార్య కోదండరాం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను కేసీఆర్‌ విస్మరించారని శ్రీనివాస్‌ ఆరోపించారు.


ప్రజలను కేసీఆర్‌ రెచ్చగొడుతున్నారు: విప్‌ లక్ష్మణ్‌ 

హైదరాబాద్, న్యూస్‌టుడే: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఫాం హౌస్‌లో కూర్చొని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కుమార్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ గేట్లు పూర్తిగా తెరిస్తే భారాసలో ఒక్కరు కూడా మిగలరని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఆయన గురువారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాలులో మాట్లాడారు. ‘కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలేదు, ప్రజలను కలవలేదు, వారి సమస్యలు పట్టించుకోలేదు. అందుకే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఓటమిపై సమీక్షించుకోకుండా కేసీఆర్‌ ఫాం హౌస్‌లో కూర్చొని సర్కారును కూలుస్తామంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ ఆలోచన విధానం మార్చుకుని నిర్ణయాత్మక ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తే బాగుంటుంది’ అని లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ లేదని, కేసీఆర్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.


‘ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసేలా జగన్‌ వ్యాఖ్యలు’

ఈనాడు, అమరావతి: నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసేలా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి విల్సన్‌ మండిపడ్డారు. ఈవీఎంలను బద్దలుకొట్టడాన్ని మామూలు నేరంగా జగన్‌ వ్యాఖ్యానించడం తగదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


7న ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబుకు ఘన సన్మానం

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 7న (ఆదివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘన సన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ భవన్‌కు తరలిరావాలని గురువారం పిలుపునిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని