సంక్షిప్త వార్తలు (6)

ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్‌ను కనుమరుగు చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

Updated : 06 Jul 2024 05:43 IST

సింగరేణిని కనుమరుగు చేసేందుకు భాజపా కుట్రలు
వామపక్షాల ధర్నాలో కూనంనేని


హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ ఎదుట ధర్నా చేస్తున్న కూనంనేని సాంబశివరావు, వామపక్షాల నేతలు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్‌ను కనుమరుగు చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. అందుకు గత ప్రభుత్వ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం మద్దతు తెలిపారని విమర్శించారు. హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ‘సింగరేణి బచావో’ నినాదంతో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సింగరేణి జోలికొస్తే సహించేది లేదన్నారు. అందులోని బొగ్గును వెలికితీసే ప్రక్రియ సింగరేణికి ఇవ్వాలని, వేలం ఆపాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిని కాపాడుకోవడానికి ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహరావు, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నేత గుమ్మడి నర్సయ్య, ఎస్‌యూసీఐ నేత మురహరి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ నరసింహ, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకురాలు జ్యోతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


శాసనసభ స్థానాలు పెంచకపోతే మండలి మనుగడకు ప్రమాదం
మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచి, మండలిని కాపాడాలని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. తెలంగాణ భవన్‌లో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టికల్‌ 169 ప్రకారం శాసనమండలిలో 40 కంటే తక్కువ సీట్లు ఉండకూడదని, అదే ఆర్టికల్‌ 171 ప్రకారం శాసనసభ సీట్లలో మూడో వంతు మాత్రమే మండలి సభ్యులు ఉండాలని . ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యేను తొలగించడం వల్ల అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 119కి తగ్గిందని, మండలిలో సభ్యుల సంఖ్య 39కి పడిపోయిందని తెలిపారు. దీంతో తెలంగాణలో శాసనమండలి మనుగడకే ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. తెలంగాణ శాసనమండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలి. దీనికోసం తాము ప్రధానమంత్రి మోదీని, కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసినా మోదీ దాటవేశారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు కృషిచేయాలని వినోద్‌కుమార్‌ అన్నారు.


సీఎంల సమావేశం శుభపరిణామం: నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం శుభపరిణామమని, ఇది రెండు రాష్ట్రాల ప్రజల క్షేమం కోరేలా జరగాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తూనే విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేసేలా కృషి చేయాలని చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలను ఆయన కోరారు .సెంటిమెంట్‌ రాజకీయాల ప్రభావం తాత్కాలికమేనని అందుకే తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌ ఎన్నికల్లో ఓడిపోయారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


కర్ణాటక భాజపా సహ ఇన్‌ఛార్జిగా సుధాకర్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు భాజపా నాయకత్వం పార్టీ ఇన్‌ఛార్జులు, సహఇన్‌ఛార్జులను నియమించింది. కర్ణాటక వ్యవహారాల సహఇన్‌ఛార్జిగా తెలంగాణకు చెందిన పొంగులేటి సుధాకర్‌రెడ్డిని నియమించింది. తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఉన్న తరుణ్‌ఛుగ్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ల ఇన్‌ఛార్జిగా బదిలీచేశారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలు పర్యవేక్షించిన వి.మురళీధరన్‌ను ఈశాన్య రాష్ట్రాల సంయుక్త సమన్వయకర్తగా నియమించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కొత్త ఇన్‌ఛార్జులను నియమించలేదు.


8న మంగళగిరిలో వైఎస్సార్‌ జయంతి

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌వలీ వెల్లడి 

విజయవాడ(గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతిని ఈ నెల 8న గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌వలీ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. జయంతి వేడుకలకు తెలంగాణ, కర్ణాటక నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు, వివిధ రాష్ట్రాలకు చెందిన అభిమానులు వస్తున్నారని పేర్కొన్నారు. పీసీసీ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో పార్టీ నేతలు ఎస్‌.ఎన్‌.రాజా, వి.గురునాథం, కొలనుకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు, మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


నేటి నుంచి జగన్‌ పులివెందుల పర్యటన

ఈనాడు, అమరావతి: వైకాపా అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ శనివారం నుంచి మూడు రోజుల పాటు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. 6, 7 తేదీల్లో అక్కడ స్థానిక నేతలను ఆయన కలవనున్నారు. 8న తన తండ్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌లో నివాళులు అర్పించనున్నారు. ఆ కార్యక్రమం తర్వాత జగన్‌ తిరిగి తాడేపల్లికి రానున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని