పవన్‌కల్యాణ్‌ వల్లే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం: జగ్గారెడ్డి

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.

Published : 06 Jul 2024 03:44 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో తెదేపా, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించడంలో పవన్‌కల్యాణ్‌ది కీలకపాత్రని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్‌లో రాష్ట్రపతి చేత తప్పులు చదివించారని విమర్శించారు. దేశం కోసం 3259 రోజులు జైలుకు వెళ్లిన నెహ్రూ, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి విమర్శించే నైతికత భాజపాకు లేదన్నారు. ఇందిరాగాంధీ గరీభీ హఠావో నినాదం బూటకమైతే ఆనాడు భాజపా సీనియర్‌ నాయకులు వాజ్‌పేయి, ఎల్‌కే అడ్వాణీలు ఎందుకు తప్పుపట్టలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అంబేడ్కర్‌ను ఓడించిందని పార్లమెంట్‌లో మోదీ అసత్యాలు మాట్లాడుతున్నారు.. కానీ అంబేడ్కర్‌ ఓడిపోయినా ఆయనను ఎంపీని చేసి కేంద్ర న్యాయశాఖమంత్రిని చేసింది కాంగ్రెస్సేనని జగ్గారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని