మండలి హస్తగతమే లక్ష్యం

తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్‌  పావులు కదుపుతోంది.

Published : 06 Jul 2024 03:46 IST

పావులు కదుపుతున్న కాంగ్రెస్‌
ఇప్పటికే ఎనిమిది మంది భారాస సభ్యుల చేరిక 
మరికొంత మందిని చేర్చుకునే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్‌  పావులు కదుపుతోంది. ఈ వ్యూహంలో భాగంగా గురువారం రాత్రి ఒకే రోజు ఆరుగురు భారాస ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది. ఇప్పటికే శాసనసభ్యుల చేరిక సాగుతుండగా... ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీల చేరికల కార్యక్రమం నిర్వహించడం సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో  చేరడం ఇదే ప్రథమం. అదీ భారీగా ఉండడం కాంగ్రెస్‌ ఎత్తుగడను నిరూపించింది. 

అప్పట్లో ఇద్దరు..

శాసనసభ ఎన్నికలకు ముందు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు దండే విఠల్‌ (ఆదిలాబాద్‌ స్థానిక సంస్థలు), భానుప్రసాద్‌ (కరీంనగర్‌ స్థానిక సంస్థలు), ఎం.ఎస్‌. ప్రభాకర్‌ (హైదరాబాద్‌ స్థానిక సంస్థలు), యెగ్గె మల్లేశం(ఎమ్మెల్యే కోటా), బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య (గవర్నర్‌ కోటా) చేరడంతో భారాస నుంచి చేరికల సంఖ్య ఎనిమిదికి చేరింది.

ఎవరికి ఎంత వరకు.. పదవీ కాలం అంటే...

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలలో యెగ్గె మల్లేశానికి 2025 మార్చి 30 వరకు, ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావుకు వచ్చే మే రెండో తేదీ వరకు, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లకు 2026 నవంబరు 15 వరకు, దండె విఠల్, భాను ప్రసాద్‌రావు, దామోదర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిలకు 2028 జనవరి అయిదో తేదీ వరకు పదవీకాలం ఉంది. 

పెరుగుతున్న కాంగ్రెస్‌ బలం 

తొలుత మండలిలో కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి ఒక్కరే ఉండేవారు. ఎన్నికల తర్వాత బల్మూరి వెంకట్, మహేశ్‌కుమార్‌గౌడ్, తీన్మార్‌ మల్లన్న గెలిచారు. భారాస నుంచి చేరిన ఎనిమిది మందితో కాంగ్రెస్‌ బలం 12కి చేరింది. మరికొంతమంది భారాస సభ్యుల్ని చేర్చుకొని ఆ పార్టీని దెబ్బతీయాలని యత్నిస్తోంది.

మండలిలో తాజా పరిస్థితి ఇదీ...

శాసన మండలిలో మొత్తం 40 స్థానాలకు గాను గవర్నర్‌ కోటాలోని రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 38లో కాంగ్రెస్‌ బలం 12కి చేరింది. మిగిలిన 26లో ఇద్దరు మజ్లిస్‌(మీర్జా రహమత్‌ బేగ్, మీర్జా రియాజుల్‌ హసన్‌) ఒకరు భాజపా (ఏవీఎన్‌రెడ్డి), ఒకరు పీఆర్‌టీయూ (రఘోత్తంరెడ్డి), స్వతంత్ర అభ్యర్థి (నర్సిరెడ్డి) ఒకరు ఉండగా మిగిలిన 21 మంది భారాస సభ్యులు. వారు... మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ బండా ప్రకాశ్, మధుసూదనాచారి, మహమూద్‌అలీ, సత్యవతి రాథోడ్, ఎల్‌.రమణ, కల్వకుంట్ల కవిత, వాణీదేవి, శంభీపూర్‌రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు, ఎం.కోటిరెడ్డి, వి.యాదవరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, నవీన్‌రావు, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పి.వెంకట్రామిరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న. గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గుత్తా సైతం చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్సీలపైనా ప్రచారం ఉంది. కాంగ్రెస్‌ తాజాగా పకడ్బందీ ప్రణాళికతో ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు ఎత్తు వేసి దానిని అమలు చేయడంతో భారాస నివ్వెరపోయింది. మిగిలిన ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. 


విలీనం కావాలంటే...

రికార్డుల ప్రకారం శాసనమండలిలో నలుగురు నామినేటెడ్‌ మెంబర్లతో కలిపి భారాస సభ్యుల సంఖ్య 29. నామినేటెడ్‌ ఎమ్మెల్సీలను మినహాయిస్తే ఆ పార్టీకి 25 మంది సభ్యులు ఉంటారు. ఆ 25 మందిలో మూడింట రెండొంతుల మంది.. అంటే 17 మంది ఎమ్మెల్సీలు భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరితే విలీనం అయ్యే వీలుంది. ఇప్పుడు గవర్నర్‌ కోటా వారు కాకుండా కాంగ్రెస్‌లో చేరిన వారు ఆరుగురు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని