హాథ్రస్‌పై రాజకీయం చేయను

దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్‌ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Updated : 06 Jul 2024 06:19 IST

కానీ తప్పు అధికార యంత్రాంగానిదే: రాహుల్‌

హథ్రస్‌/అలీగఢ్‌: దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్‌ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ధైర్యం చెప్పారు. కొంత మంది రాహుల్‌ను కౌగిలించుకొని రోదించారు. అనంతరం రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఘటనను తాను రాజకీయం చేయదలచుకోవడం లేదని తెలిపారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం తప్పిదాల వలనే ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని అన్నారు. బాధితులకు ఉదారంగా పరిహారమివ్వాలని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆరు నెలలు లేదా ఏడాది తర్వాత పరిహారమిస్తే ప్రయోజనం లేదని అన్నారు. ఉదయం దిల్లీ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన రాహుల్‌ గాంధీ తొలుత అలీగఢ్‌ చేరుకున్నారు. అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం హాథ్రస్‌ చేరుకుని అక్కడ కూడా బాధితులను పరామర్శించారు. కాగా ఈ ఘటన ప్రధాన నిందితుడు దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.


రాహుల్‌ను కలిసిన రైల్వే లోకో పైలట్లు

దిల్లీ: భారత రైల్వేలకు చెందిన 50 మంది లోకో పైలట్లు శుక్రవారం దిల్లీ రైల్వే స్టేషన్‌లో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిశారు. తమ ఇబ్బందులను విన్నవించారు. లోకో పైలట్లుగా తాము స్వస్థలం నుంచి దూర ప్రాంతాలకు రైళ్లను నడపాల్సి వస్తోందని, తమకు సరిపడినంత విశ్రాంతి దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది తగినంత లేకపోవడంతో విరామం లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైల్వే సమస్యలను.. ముఖ్యంగా ప్రైవేటీకరణ అంశాన్ని, తగినంత సిబ్బంది లేకపోవడాన్ని తాను ఎప్పటికప్పుడు పార్లమెంటులో ప్రస్తావిస్తున్నానని వారికి రాహుల్‌ తెలిపినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని