ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్‌

ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్‌ రాజ్‌భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది.

Published : 06 Jul 2024 03:47 IST

పశ్చిమ బెంగాల్లో మరో వివాదం

కోల్‌కతా: ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్‌ రాజ్‌భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. ఇద్దరు కొత్త సభ్యులతో ప్రమాణం చేయించిన స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.  

ఇటీవలి ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు...రేయాత్‌ హుసేన్‌ సర్కార్, సయంతికా బెనర్జీలతో స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ శుక్రవారం అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదాపడింది. వీరి ప్రమాణం రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలన్న తన వైఖరిని సడలించుకున్న గవర్నర్‌ సి.వి.ఆనంద్‌ బోస్‌ ఆ కార్యక్రమాన్ని అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఆశీష్‌ బెనర్జీ ద్వారా చేయించాలని నిర్ణయించారు. ఆ మేరకు గురువారం సాయంత్రం ఆదేశాలిచ్చారు. శుక్రవారం ఒకరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ భేటీ కాగా సభా నిర్వహణకు స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ అధ్యక్షత వహించారు. సభాపతి ఉన్న సమయంలో కొత్త సభ్యులతో తాను ప్రమాణం చేయించడం సరికాదంటూ శాసనసభ నిబంధన 5ను ఉటంకిస్తూ డిప్యూటీ స్పీకర్‌ ఆశీష్‌ బెనర్జీ అందుకు నిరాకరించారు. ఆయన అభ్యర్థనతో స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు.

ఆ తర్వాత కొంత సమయానికి...‘రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగింద’ంటూ రాష్ట్రపతికి ఒక నివేదిక పంపించినట్లు సామాజిక మాధ్యమం ద్వారా రాజ్‌భవన్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని