అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు

వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు.

Published : 06 Jul 2024 05:42 IST

అమరావతిని పాడుబెట్టారు
ప్రజాప్రతినిధుల భవనాల వ్యయం రూ. 300 కోట్లు పెరిగింది
శాసనసభాపతి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు
రాయపూడిలోని భవన సముదాయాల పరిశీలన 

రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలను పరిశీలిస్తున్న
శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు. చిత్రంలో ఎమ్మెల్యేలు తెనాలి
శ్రావణ్‌కుమార్, విష్ణుకుమార్‌రాజు, సీఆర్డీఏ అధికారులు, తదితరులు

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. దీనిని ప్రజలకు అంకితం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన.. సీఆర్డీఏ, అసెంబ్లీ అధికారులతో కలసి రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాజధానిలో వసతి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లలో ఉంటూ అసెంబ్లీకి రావాల్సి వస్తోంది. స్పీకర్‌గా ప్రజాప్రతినిధులకు వసతి కల్పించాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను 1983 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా.. హైదరాబాద్‌లో కూడా ఇన్ని సదుపాయాలతో నివాస సముదాయాలు లేవు. చంద్రబాబు హయాంలో మంచి వసతులతో ప్లాన్‌ చేశారు. ఇంత అద్భుతమైన ప్రణాళికను ఎక్కడా చూడలేదు. ఈ ఐదేళ్లలో దీనిని పూర్తి చేస్తే.. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. 

9 నెలల్లో నివాస సముదాయాలు సిద్ధం...

అసెంబ్లీలో సీఆర్డీఏ అధికారులతో సమావేశం నిర్వహించా. శాసనసభ, శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 ఫ్లాట్లతో 12 అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల పనులు నిలిచిపోయాయి. తిరిగి ప్రారంభించాలంటే ప్రస్తుతం వ్యయం రూ.300 కోట్లు పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం చెల్లిస్తే తాము పనులు చేసేందుకు సిద్ధమని గుత్తేదారులు చెబుతున్నారు. 9 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చాం. అసెంబ్లీలో వసతులు చాలడం లేదు. గత ఐదేళ్లలో అసెంబ్లీకి కనీసం సున్నం వేయలేదు. డబ్బులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. పవిత్రమైన శాసనసభకు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకోవాలి. సున్నం వేయాలని, లీకేజీలను సరిచేయాలని సీఆర్డీఏ కమిషనర్‌కు చెప్పా’’అని అయ్యన్నపాత్రుడు వివరించారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని పరిశీలించారు. అందులో మీడియా పాయింట్, భోజనశాల, గ్రంథాలయం తదితర వసతులతో సిద్ధం చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, సీఈ ధనుంజయ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పీవీకే రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని