భారీ రాజకీయ కుట్రకు నా భర్త బలయ్యారు: సునీతా కేజ్రీవాల్‌

భారీ రాజకీయ కుట్రకు తన భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ బలయ్యారని సునీతా కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఓ సాక్షి ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగా మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందని ఓ వీడియో సందేశంలో ఆమె తెలిపారు.

Published : 07 Jul 2024 03:49 IST

దిల్లీ: భారీ రాజకీయ కుట్రకు తన భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ బలయ్యారని సునీతా కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఓ సాక్షి ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగా మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందని ఓ వీడియో సందేశంలో ఆమె తెలిపారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నిజాయతీపరుడని, ఆయనకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. లేకపోతే విద్యావంతులు, నిజాయతీపరులు రాజకీయాల్లోకి రారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిందని తెలిపారు. తన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని అరెస్టు చేసి బెయిల్‌ నిరాకరించేటప్పటికి సీఎంతో తన సమావేశానికి సంబంధించి వాంగ్మూలాన్ని శ్రీనివాసులురెడ్డి మార్చివేశారని సునీత ఆరోపించారు. ‘‘దాదాపు పది మంది వ్యక్తుల సమక్షంలో దిల్లీ మద్యం వ్యాపారంలోకి ప్రవేశించమని, ఆప్‌కు రూ.100 కోట్లు చెల్లించాలని కేజ్రీవాల్‌ తనను అడిగారని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఎవరైనా అంత మంది మధ్య అలా అడుగుతారా’’ అని సునీత ప్రశ్నించారు. శ్రీనివాసులురెడ్డి తన వాంగ్మూలాన్ని మార్చగానే ఆయన కుమారుడికి బెయిల్‌ వచ్చిందని చెప్పారు. దీన్ని బట్టి ఆయన తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని అర్థమవుతోందని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని