మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై హస్తం గురి

త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్ర, హరియాణాలలో కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి రాణించిన హస్తం పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తోంది.

Published : 07 Jul 2024 03:51 IST

టికెట్‌ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
రెండు రాష్ట్రాల్లో విజయంపై కాంగ్రెస్‌ పార్టీ ధీమా

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్ర, హరియాణాలలో కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి రాణించిన హస్తం పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తోంది. మహారాష్ట్రలో మిత్రపక్షాలైన ఎన్సీపీ, శివసేన(యూబీటీ)తో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయనుంది. హరియాణాలో మాత్రం ఒంటరి పోరాటానికే నిర్ణయించుకుంది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభలకు నవంబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో పార్టీ టికెట్‌ ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. దీనికి గాను నామమాత్రపు రుసుమును నిర్ణయించారు. సాధారణ వర్గాలకు చెందిన నేతలు రూ.20,000, రిజర్వుడ్‌ కేటగిరీ వర్గాల వారు రూ.5,000లను దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. విజయావకాశాలు మెరుగ్గా ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. మహారాష్ట్రలో పార్టీ బలంగా ఉందని, ఈసారి గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్‌ నేత ఆశిష్‌ దువా తెలిపారు. మహా వికాస్‌ అఘాడీలోని శివసేన(యూబీటీ),  ఎన్‌సీపీ(ఎస్పీ), కాంగ్రెస్‌) నేతల కీలక సమావేశం త్వరలో నిర్వహిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని