అస్తిత్వ రాజకీయాలే ప్రతిబంధకాలు

సంస్థాగతంగా పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎంలో అంతర్మథనం జరుగుతోంది. కుల, మత, జాతుల ప్రాతిపదికన విస్తరిస్తున్న అస్తిత్వ రాజకీయాలు వామపక్ష శక్తులకు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది.

Updated : 07 Jul 2024 04:32 IST

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం కేంద్ర కమిటీ
కేరళ, బెంగాల్, త్రిపురలోనూ వైఫల్యంపై అంతర్మథనం

దిల్లీ: సంస్థాగతంగా పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎంలో అంతర్మథనం జరుగుతోంది. కుల, మత, జాతుల ప్రాతిపదికన విస్తరిస్తున్న అస్తిత్వ రాజకీయాలు వామపక్ష శక్తులకు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. 18వ లోక్‌సభ ఎన్నికలో పార్టీ పని తీరుపై రూపొందించిన నివేదికను గత నెల 28-30 తేదీల్లో దిల్లీలో జరిగిన సమావేశాల్లో కేంద్ర కమిటీ ఆమోదించింది. కేరళలో చాలా కాలంగా తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ భాజపా పాగా వేయడాన్ని సీపీఎం నేతలు గుర్తించారు. ‘‘పార్టీకి ప్రజాదరణ తగ్గిపోవడం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. అది ఇప్పుడూ కొనసాగింది. తీవ్ర ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పార్టీకి గట్టి పునాదులు, ప్రజాబలం ఉన్న రాష్ట్రాల్లోనూ ఓటములు ఎదురుకావడం’’ అని సీపీఎం కేంద్ర కమిటీ తన నివేదికలో పేర్కొంది.

కేరళలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకి గత పదేళ్లలో (2014-2024) ఓట్లు 10.08 శాతం నుంచి 19.2 శాతానికి పెరిగాయి. అంటే దాదాపు రెట్టింపయ్యాయి. అదే సమయంలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కి ఓట్లు 40.2 శాతం నుంచి 33.35 శాతానికి పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో భాజపాను కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఓడించగలదని  ఓ వర్గం ప్రజలు ముఖ్యంగా మైనారిటీలు భావించడమేనని సీపీఎం కేంద్ర కమిటీ నివేదిక పేర్కొంది. వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ తొలుత పోటీ చేసిన 2019లోనూ ఇదే ట్రెండ్‌ కనిపించిందని తెలిపింది. త్రిశ్శూర్‌లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన క్రిస్టియన్ల ఓట్లు, అట్టింగళ్, అలప్పుళ వంటి ప్రాంతాల్లో సీపీఎం సంప్రదాయ ఓట్లు కూడా భాజపా అభ్యర్థికి బదిలీ అయ్యాయని పేర్కొంది. భాజపా-ఆరెస్సెస్‌ల హిందుత్వ రాజకీయాలు కూడా  కేరళ ఓటర్లపై ప్రభావం చూపాయని సీపీఎం కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. పశ్చిమబెంగాల్‌లో సీపీఎం ఓట్ల శాతం గణనీయంగా పెరిగిన నియోజకవర్గాల్లో భాజపా ఓడిపోయిందని, అయితే, ఆ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా ఇంకా బలహీనంగానే ఉన్నామని కేంద్ర కమిటీ పేర్కొంది. 

త్రిపురలో చాలా ఏళ్ల వరకు గిరిజనుల్లో బలంగా ఉన్న వామపక్షాల పునాదులు క్రమంగా బలహీనపడుతున్నాయని, జాతుల పేరుతో స్థానికంగా రాజకీయ పార్టీల ఆవిర్భావం కూడా దీనికి కారణమని సీపీఎం కేంద్ర కమిటీ వివరించింది. 

లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి భాజపాను వెనక్కి నెట్టేలా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ... వామపక్షాలు బలం పుంజుకోలేకపోయాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని