గుజరాత్‌లో భాజపాను ఓడిస్తాం

ఎన్నికల్లో భాజపాను అయోధ్యలో (ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో) ఓడించినట్లే గుజరాత్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చెప్పారు.

Published : 07 Jul 2024 03:58 IST

ఇక్కడా అయోధ్యలాంటి ఫలితమే 
రాసి పెట్టుకోండి.. జరిగి తీరుతుంది
మోదీలాంటి నేత కాంగ్రెస్‌లో ఉంటే వ్యతిరేకించేవాళ్లం: రాహుల్‌ 

అహ్మదాబాద్‌: ఎన్నికల్లో భాజపాను అయోధ్యలో (ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో) ఓడించినట్లే గుజరాత్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చెప్పారు. భాజపా సీనియర్‌ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ నేతృత్వం వహించిన రామమందిర ఉద్యమాన్ని ఇండియా కూటమి ఓడించినట్లయిందని పేర్కొన్నారు. తమ పార్టీకి భాజపా ఒక సవాల్‌ విసిరి బెదిరించినా ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో దానిని తాము ఓడించి తీరుతామని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం అహ్మదాబాద్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘..కొద్దిరోజుల క్రితం ఇక్కడ మన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి భాజపా సవాల్‌ విసిరింది. వారు ఎలా కొట్టారో మనమంతా కలిసి వారి ప్రభుత్వాన్ని అలాగే కొట్టబోతున్నాం. కావాలంటే రాసిపెట్టుకోండి.. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుంది, మోదీని, భాజపాని ఓడిస్తుంది. ఈ రాష్ట్రం నుంచే కొత్త శకాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తుంది. మోదీ దార్శనికత అనే బుడగ పేలిపోయింది. ప్రజలకు మనం ధైర్యం చెబితే చాలు. తనకు నేరుగా దేవుడితో సంబంధం ఉందని చెప్పిన మోదీని ఆ విషయంపై నేను పార్లమెంటులోనే అడిగాను. దేవుడితోనే అనుసంధానమైతే అయోధ్యలో ఎలా ఓడిపోయారని అడిగాను. గుజరాత్‌లోని వజ్రాల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కష్టాలనే అర్థం చేసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఒరగబెట్టగలరు? భయపడకుండా ప్రజలు పోరాడితే భాజపా నిలబడడం కష్టమే’’ అని రాహుల్‌ చెప్పారు. 

వారణాసిలోనూ ఓడించేవాళ్లమే..

‘‘మోదీ అయోధ్య (ఫైజాబాద్‌)లోనూ పోటీ చేయాలనుకున్నారు. అక్కడ ఓటమి తప్పదని, రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుందని ఆయన తరఫున సర్వేచేసినవారు చెప్పారు. అందుకే వారణాసినే ఎంచుకున్నారు. అక్కడ మనం కొన్ని తప్పులు చేశాం. లేదంటే అక్కడా మోదీని ఓడించేవాళ్లం. కాంగ్రెస్‌ చిహ్నమైన హస్తం ప్రతి మతంలోనూ ఉంది. గురునానక్, మహావీరుడు, బుద్ధుడి చిత్రాలను చూడండి. చివరకు ఇస్లాంలోనూ ఆశీర్వదించడానికి హస్తాన్నే వాడతారు. శివుడి చిత్రంలోనూ అదే ఉంటుంది. భయపడకండి.. ఎవరినీ భయపెట్టకండి అని హస్తం చెబుతుంది. మోదీలాంటి నేత కాంగ్రెస్‌లో ఉండిఉంటే మొత్తం పార్టీ ఆయనకు వ్యతిరేకంగా నిలిచేది. భాజపా కార్యకర్తలకు అలాంటి ధైర్యం లేదు’’ అని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని