పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి

కాంగ్రెస్‌ పార్టీ ‘పాంచ్‌ న్యాయ్‌ పత్ర్‌’ హామీ మేరకు.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 07 Jul 2024 04:01 IST

నాయకులపై కేసులుంటే భాజపాలోకి తీసుకోబోం 
కొలువులివ్వకుంటే కాంగ్రెస్‌ ఉద్యోగాలు పోతాయి
మీడియాతో చిట్‌చాట్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ‘పాంచ్‌ న్యాయ్‌ పత్ర్‌’ హామీ మేరకు.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. భారాసకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటున్న కాంగ్రెస్‌ పార్టీకి, వారితో రాజీనామా చేయించి గెలిపించుకునేందుకు భయం పట్టుకుందని విమర్శించారు. నాయకులపై ఈడీ, సీబీఐ కేసులు ఉంటే భాజపాలోకి తీసుకోబోమని చెప్పారు. వారు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని పార్టీలోకి రావాలన్నారు. యువతకు ఉద్యోగాల్లేక కాంగ్రెస్‌ నేతలకు ఉద్యోగాలు వచ్చాయని.. కొలువులివ్వకుంటే వారి ఉద్యోగాలు పోతాయన్నారు. కేంద్ర మంత్రి పదవితో పగ్గాలు పడినా... రాజకీయ విమర్శల్లో తన దూకుడు తగ్గబోదని స్పష్టం చేశారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ‘‘కేంద్ర మంత్రులందరం సోమవారం నుంచి శుక్రవారం వరకు దిల్లీలో ఉండాలి.. శని, ఆదివారాల్లో పార్టీ కార్యక్రమాలు, ఇతర పర్యటనలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్టీ మారిన వారిలో కె.కేశవరావు ఒక్కరే రాజీనామా చేశారు. ఎందుకంటే ఆ పదవికి పోటీ ఉండదు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అన్నీ భాజపా గెలుస్తుంది. ఇప్పటికే ఉన్న ఎనిమిది మంది హీరోలతో కలిపి 34 మందితో ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది.

గోడమీది పిల్లిలా ఎంఐఎం..

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఇప్పటికే ఏడు నెలలు గడిచినా ఒక్క ఉద్యోగం నోటిఫై చేయలేదు. కొలువుల విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఎమ్మెల్యేల చేరిక డ్రామాలు తెరపైకి తీసుకువస్తోంది. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా అందలేదు. పంచాయతీలకు రూ.3వేల కోట్ల బిల్లులు ఇవ్వాలి. సర్పంచులు బిల్లులురాక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదు. ఎంఐఎం పార్టీ గోడమీది పిల్లిలా ఉంటుంది. ఒవైసీ కుటుంబం ఆస్తులు సంపాదించేందుకు, సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు ఎవరు అధికారంలోకి వస్తే వారితో కలుస్తుంది. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల ఊచకోతలు లేకుండా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. 

రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి

ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ బిడ్డగా సొంత అభిప్రాయాలు ఉన్నా, భారత ప్రభుత్వ ప్రతినిధిగా రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఇందులో ఏమైనా జరిగితే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి మరో ఉద్యమం చేసి లబ్ధిపొందాలని కొందరు చూస్తున్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ రానీయొద్దు’’  అని బండి సంజయ్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని