ఏ కేసులూ లేని ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా, జనసేన అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్‌ కేసులూ లేవని వెల్లడించారు.

Published : 07 Jul 2024 05:26 IST

రామచంద్రయ్య కుటుంబ ఆస్తి రూ.57 కోట్లు 
హరిప్రసాద్‌ దంపతులకు 2 కిలోల బంగారం, 2 ఫ్లాట్లు

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా, జనసేన అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్‌ కేసులూ లేవని వెల్లడించారు. వీరిద్దరూ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలివీ.. 


సి.రామచంద్రయ్య

సి.రామచంద్రయ్య కుటుంబ ఆస్తి సుమారు రూ.57 కోట్లు ఉన్నట్లు   అఫిడవిట్‌లో చూపించారు. రామచంద్రయ్య కంటే ఆయన భార్య పేరిటే ఎక్కువ ఆస్తులున్నాయి. ఆమె పేరిట ఉమ్మడి కడప, రంగారెడ్డి, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల భూములు, స్థలాలున్నట్లు వెల్లడించారు.

  • రామచంద్రయ్య తనకు రూ.60 లక్షల విలువైన వోల్వో కారు, రూ.19.87 లక్షల విలువైన 330 గ్రాముల బంగారం, చేతిలో రూ.62,883 నగదు సహా మొత్తం రూ.3.41 కోట్ల విలువైన చరాస్తులు, రూ.14.41 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపారు. రూ.2.38 కోట్ల అప్పులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
  • తన భార్య వద్ద రూ.43.06 లక్షల విలువైన 650 గ్రాముల బంగారం, చేతిలో రూ.1,54,729 నగదు, రూ.3.49 కోట్ల విలువైన చరాస్తులు, రూ.31.86 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.3.84 కోట్ల అప్పులున్నట్లు వివరించారు. ఇవికాక హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కింద కూడా రూ.1.64 కోట్ల చరాస్తులు, రూ.2.26 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు చూపించారు.

పి.హరిప్రసాద్‌

జనసేన తరఫున ఎన్నికైన హరిప్రసాద్‌ తన వద్ద రూ.26.10 లక్షల విలువచేసే 550 గ్రాముల బంగారం, 2019 మోడల్‌ స్విఫ్ట్‌ కారు, చేతిలో రూ.50 వేల నగదు, నాలుగు బ్యాంకుల్లోని నాలుగు ఖాతాల్లో మొత్తం రూ.6.51 లక్షలు ఉన్నాయని వివరించారు. మొత్తంగా తన పేరిట రూ.39.11 లక్షల విలువైన చరాస్తులు, రూ.49వేల బ్యాంకు రుణం ఉన్నట్లు వెల్లడించారు. 

తన భార్య పేరిట రూ.72.50 లక్షల విలువైన 1,550 గ్రాముల బంగారం, బీమా మొత్తం రూ.28 లక్షలు, నాలుగు బ్యాంకు ఖాతాల్లో  కలిపి రూ.5.95 లక్షల నగదు ఉన్నాయని చూపారు. మైలవరం మండలం మొరుసుమిల్లిలో 3.76 ఎకరాల భూమి, కాకినాడ జిల్లా కరప మండలంలో 300, సామర్లకోట మండలంలో 240 చదరపు గజాల స్థలాలు ఉన్నాయని.. వీటన్నింటి ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు రూ.59.96 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ చిక్కడపల్లి, మణికొండల్లో రూ.1.75 కోట్ల విలువైన    రెండు ఫ్లాట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆమె పేరిట రూ.39.98 లక్షల గృహ రుణం ఉందని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని