మన భూభాగంలో చైనా బంకర్లా?

చైనాతో సరిహద్దుల విషయంలో అందరి అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండు చేశారు.

Updated : 08 Jul 2024 03:56 IST

సరిహద్దు విషయంలో అందరి అభిప్రాయాలను వినండి
ప్రధాని మోదీకి ఖర్గే సూచన

దిల్లీ: చైనాతో సరిహద్దుల విషయంలో అందరి అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండు చేశారు. 2020 మే నెల వరకూ మన భూభాగంలో ఉన్న ప్రాంతాల్లో చైనా బంకర్లను ఎలా నిర్మిస్తోందని ఆదివారం ఆయన ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సు చుట్టూ చైనా బంకర్లను నిర్మిస్తోందని వచ్చిన మీడియా కథనాలను, శాటిలైట్‌ చిత్రాలను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. ‘గల్వాన్‌లో ఎటువంటి ఆక్రమణలు లేవని ప్రధాని మోదీ క్లీన్‌చిట్‌ ఇచ్చి ఐదేళ్లవుతోంది. అక్కడ మన సైనికులెందరో ప్రాణత్యాగాలు చేశారు. అయినా చైనా మన సమగ్రతను దెబ్బతీసేలా మన భూభాగంలో నిర్మాణాలను చేపడుతోంది. సిరిజాప్‌లో సైనిక స్థావరాన్ని నిర్మిస్తోంది. అది మన భూభాగంలోనిదే. వాస్తవాధీన రేఖ వెంట స్టేటస్‌ కోను కొనసాగించడంలో మోదీ విఫలమయ్యారు. 65 పెట్రోలింగ్‌ కేంద్రాల్లో 26 కేంద్రాలను మనం కోల్పోయాం. మోదీ చైనా గ్యారంటీ ఇంకా కొనసాగుతోంది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. అందుకే చైనాతో సరిహద్దు విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకుసాగాలని డిమాండు చేస్తున్నామని పేర్కొన్నారు. భుజం భుజం కలిపి సైనికులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. 

మరింతగా నిరుద్యోగ సంక్షోభం

దేశంలో నిరుద్యోగ సంక్షోభాన్ని భాజపా ప్రభుత్వం మరింత తీవ్రంగా మారుస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. పెద్ద నోట్ల రద్దు, ఆలోచన లేకుండా తెచ్చిన జీఎస్టీ, చైనా నుంచి దిగుమతుల పెంపుద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని, ఫలితంగానే ఉద్యోగ కల్పన అడుగంటిందని విమర్శించింది. సిటీ గ్రూప్‌ నివేదికను ప్రస్తావిస్తూ ఆదివారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఐదేళ్లుగా నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్‌ ప్రస్తావిస్తూనే ఉందని, ప్రధాని అసమర్థ విధానాలవల్ల 45ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి నిరుద్యోగం పెరిగిపోయిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు