రైతుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం

రాష్ట్రంలో రోజుకో రైతు ప్రాణం పోతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గు చేటని భారాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Published : 08 Jul 2024 05:38 IST

భారాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

విలేకరులతో మాట్లాడుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చిత్రంలో కమల్‌రాజు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 

చింతకాని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రోజుకో రైతు ప్రాణం పోతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గు చేటని భారాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు ప్రభాకర్‌ కుటుంబ సభ్యులను భారాస బృందం ఆదివారం పరామర్శించింది. జిల్లా పార్టీ తరఫున బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతు తన ఆత్మహత్యకు కారకులుగా చెప్పిన వారిని వదిలిపెట్టి, ప్రతిపక్ష భారాస నాయకులపై  పోలీసులు కేసు పెట్టడం సరికాదన్నారు. రైతు మృతికి కారణమైన తహసీల్దార్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధిత రైతుకు అండగా కలెక్టరేట్‌కు వెళ్లిన భారాస మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యపై కేసు ఎలా పెడతారని పల్లా ప్రశ్నించారు. అనంతరం పుల్లయ్య ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని