సంక్షిప్త వార్తలు (3)

విభజన చట్టంలోని ఆస్తుల పంపకాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని తమ పార్టీ స్వాగతిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

Updated : 08 Jul 2024 06:40 IST

సీఎంల భేటీని స్వాగతిస్తున్నాం: నారాయణ 

ఆజాద్‌నగర్‌ (అనంతపురం), న్యూస్‌టుడే: విభజన చట్టంలోని ఆస్తుల పంపకాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని తమ పార్టీ స్వాగతిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. గతంలో జగన్, కేసీఆర్‌లు భేటీ అయినా.. ఏపీ ముఖ్యమంత్రి పెద్ద డిమాండ్లు ఏమీ చేయకుండా, కేసీఆర్‌ అడగకపోయినా ఏపీ భవనాలను తెలంగాణకు ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుత సీఎంలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.


‘సీఎంల సమావేశం చరిత్రాత్మకంగా మిగలాలి’

విజయవాడ (కృష్ణలంక): హైదరాబాద్‌లో శనివారం జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం చరిత్రాత్మకంగా మిగలాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘విభజన చట్టం స్ఫూర్తి ప్రకారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయానికి ఇరు రాష్ట్రాల పార్టీలు, ప్రజలు బద్ధులై ఉండాలి. ప్రత్యేక హోదా విషయంపై మేము తక్షణం ఉద్యమించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. 


సీఎంల చర్చలు హర్షణీయం: సీపీఎం  

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం నిర్వహించడం హర్షణీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘విభజన హామీలు అమలు చేయటంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి’ అని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని