బిల్లుపై అభిప్రాయం చెప్పకపోతే దాన్ని ఆమోదించినట్లే

ఏదైనా బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఒక సభ్యుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేయకపోతే ఆ బిల్లుకు అంగీకారం తెలిపినట్లే అవుతుందని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం వ్యాఖ్యానించారు.

Published : 09 Jul 2024 04:18 IST

రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ వ్యాఖ్య

 దిల్లీ: ఏదైనా బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఒక సభ్యుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేయకపోతే ఆ బిల్లుకు అంగీకారం తెలిపినట్లే అవుతుందని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర న్యాయ చట్టాలను తాత్కాలిక విధి నిర్వాహకులు రూపొందించారని చిదంబరం ఇటీవల ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్ణించారు. ఇది దిగ్భ్రాంతికరమనీ, ఏమాత్రం క్షంతవ్యం కాదనీ, చిదంబరం వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ధన్‌ఖడ్‌ శనివారం డిమాండ్‌ చేశారు. సోమవారం రాజ్యసభ శిక్షణార్థుల(ఇంటర్న్స్‌)తో ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ చిదంబరం పేరెత్తకుండా ఆయనపై విమర్శలు చేశారు. ఒక సంఘంలో సభ్యుడైన వ్యక్తి సంబంధిత బిల్లుపై తన అభిప్రాయాలను ఆ సంఘంలోనే వ్యక్తీకరించాలనీ, అలా చేయకపోతే బిల్లుకు ఆమోదం తెలిపినట్లేనని ధన్‌ఖడ్‌ అన్నారు. రాజ్యసభ సభ్యుడైన వ్యక్తి సభలో చర్చలో పాల్గొనకపోతే తన రాజ్యాంగ విధిని విస్మరించినట్లవుతుందనీ, అలా కాకుండా సభ వెలుపల విమర్శలు, వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజ్యాంగ వేదికపై భావ ప్రకటన హక్కును వదలుకున్నట్లవుతుందనీ ధన్‌ఖడ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని