రాహుల్‌ను ప్రధాని చేయడమే వైఎస్‌ లక్ష్యం: సీఎం రేవంత్‌

రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి లక్ష్యమని, దీనికోసం కృషి చేసేవారే ఆయన వారసులని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 09 Jul 2024 04:27 IST

పంజాగుట్ట సర్కిల్‌లో వైఎస్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క,
మల్లు రవి, మధుయాస్కీగౌడ్, దీపా దాస్‌మున్షీ,  షబ్బీర్‌ అలీ, కేవీపీ
రామచంద్రరావు, సునీతారావు, విజయారెడ్డి,  అనిల్‌కుమార్‌యాదవ్‌ 

ఈనాడు, న్యూస్‌టుడే- హైదరాబాద్‌: రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి లక్ష్యమని, దీనికోసం కృషి చేసేవారే ఆయన వారసులని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో ఏ పార్టీకైనా సంక్షేమం అంటే ఎలా ఉంటుందనేది గుర్తుచేసేది వైఎస్‌ పాలన అని, ఆయన ముద్ర పేదల గుండెల్లో బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలకు, రాహుల్‌గాంధీ పాదయాత్రకు ఆయనే స్ఫూర్తి అని అన్నారు. వైఎస్‌ 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాభవన్, గాంధీభవన్, సీఎల్పీ కార్యాలయాల్లో వైఎస్‌ చిత్రపటాలకు, పంజాగుట్ట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, హర్కర వేణుగోపాలరావు, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు, రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రేమ్‌సాగర్‌రావు, యశస్వినీరెడ్డి, నేతలు కేవీపీ రామచంద్రరావు, మధుయాస్కీగౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, జి.నిరంజన్, టి.కుమార్‌రావు, శంకర్‌రావు, వంశీచంద్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేటర్‌ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాభవన్‌లో రాజశేఖరరెడ్డి ఫొటో గ్యాలరీని సీఎం ప్రారంభించి తిలకించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి వైఎస్‌ స్ఫూర్తి అన్నారు. రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా 35 మంది నేతలకు కార్పొరేషన్‌ పదవులు ఇచ్చామని చెప్పారు. 

పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి రావాలి: భట్టి

రాబోయే రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారంతా తిరిగి రావాలని, ఇందిరమ్మ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కోట్ల మంది ప్రజల హృదయాల్లో వైఎస్‌ స్థానం సుస్థిరంగా ఉందని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని