వైకాపా నేతల భూకబ్జాలు వెలికితీయాలి

వైకాపా నాయకులు ఆక్రమించిన ప్రభుత్వ, పేదల భూములకు సంబంధించి రికార్డులు వెంటనే సిద్ధం చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 09 Jul 2024 04:49 IST

రెవెన్యూ సిబ్బందికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశం 
రాయచోటిలో రూ.2 వేల కోట్ల స్థలాలు కొట్టేశారని ఫిర్యాదు 

సంబేపల్లె మండలం రెడ్డివారిపల్లి వద్ద వైకాపా నాయకులు ఆక్రమించిన వంక పోరంబోకును పరిశీలిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటి, సంబేపల్లె, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు ఆక్రమించిన ప్రభుత్వ, పేదల భూములకు సంబంధించి రికార్డులు వెంటనే సిద్ధం చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం, సంబేపల్లె మండలాల్లో ఆ పార్టీ నేతలు కబ్జా చేసిన భూములను ఆర్డీవో రంగస్వామి, రెవెన్యూ సిబ్బందితో కలిసి మంత్రి సోమవారం పరిశీలించారు. వైకాపా ఐదేళ్ల పాలనలో కేవలం రాయచోటి నియోజకవర్గంలోనే రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆయన సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేశారు. వీటి రికార్డులు రెండు రోజుల్లో వెలికితీసి ప్రభుత్వానికి అందించాలన్నారు. సంబేపల్లి మండలం దేవపట్ల వద్ద జాతీయ రహదారిపై 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ‘పెద్ద రెడ్లు’ అని చెప్పుకొంటున్న నేతలు ఆక్రమించినట్లు గుర్తించారు. గతంలో రెవెన్యూ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించి ప్రభుత్వ భూములను వైకాపా నేతలకు కట్టబెట్టిన అధికారులే.. నేడు వాటిని వెలికి తీయాలని ఆదేశించారు. దేవపట్ల, రెడ్డివారిపల్లి ప్రాంతాల్లో కబ్జా అయిన రూ.వంద కోట్ల విలువైన స్థలాలను మంత్రి పరిశీలించారు. ఆక్రమణదారులు వేసుకున్న కంచెలను రెండు రోజుల్లోగా వారే స్వచ్ఛందంగా తొలగించుకునేలా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వంక పొరంబోకు భూములను వైకాపా నాయకులకు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. రికార్డుల నిర్వహణలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండేలా చూడాలని కలెక్టర్‌కు సూచించినట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని