BJP: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో దఫా ఏర్పాటైన ఎన్డీయే సర్కారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మందుకు సాగుతోందని, 2047 నాటికి ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ నిలుస్తుందని భాజపా ముఖ్యనాయకులు  అరుణ్‌సింగ్, కేంద్ర మంత్రి మురుగన్‌ పేర్కొన్నారు.

Published : 09 Jul 2024 04:58 IST

భాజపా రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యనేతలు 

జ్యోతిని వెలిగించి సమావేశాన్ని ప్రారంభిస్తున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌. చిత్రంలో పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, కేంద్ర సహాయ మంత్రి మురుగన్, సుజనాచౌదరి, తదితరులు 

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, దేవీచౌక్, టి.నగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో దఫా ఏర్పాటైన ఎన్డీయే సర్కారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మందుకు సాగుతోందని, 2047 నాటికి ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ నిలుస్తుందని భాజపా ముఖ్యనాయకులు  అరుణ్‌సింగ్, కేంద్ర మంత్రి మురుగన్‌ పేర్కొన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధిస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన  సోమవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల వైకాపా పాలనలో అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టడం వల్ల ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారు. బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి సన్నగిల్లిందేమో.. ప్రజావేదిక కూల్చివేత నుంచి అంతర్వేది రథం దగ్ధం, పిఠాపురంలో ఆలయం ధ్వంసం, దుర్గమ్మ సింహాల అపహరణ, రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం.. ఇవన్నీ విధ్వంసం కాదా? మరిచిపోయారా? రాష్ట్ర ప్రజలు తెలివైనవారన్న విషయం జగన్‌ మరచిపోయారు. పథకాల బటన్‌ నొక్కుడు పేరుతో వారెంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో బుద్ధి చెప్పారు’ అని అన్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ మాట్లాడుతూ.. తెదేపా అధినేత చంద్రబాబు ఆ పార్టీకే కాకుండా భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారన్నారు. కూటమి ఏర్పడడంలో పవన్‌కల్యాణ్‌ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్ర కార్యాలయంలో ప్రతి వారం ప్రజా దర్బార్‌ నిర్వహించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘటన్‌ మధుకర్, పార్టీ నేతలు సీఎం రమేశ్, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌ రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదినాయణరెడ్డి, పార్ధసారథి, జీవీఎల్‌ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న భాజపా నాయకులు, శ్రేణులు

 రామోజీరావుకు నివాళులు 

ఇటీవల మరణించిన రామోజీ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, భాజపా నాయకులు, కార్యకర్తలు, నదిలో జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లకు సమావేశంలో నివాళులు అర్పించారు.

వైకాపా నేతల చేరికపై తొందరపాటు వద్దు 

దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీలతో విభేదాలు లేకుండా సమన్వయం చేసుకుని ముందుకుసాగాలని భాజపా సంఘటన జాతీయ కార్యదర్శి శివప్రకాశ్‌జీ శ్రేణులకు సూచించారు. శ్రేణులతో అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా ఓడిన నేపథ్యంలో అనేకమంది భాజపాలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోందని, చేరికలవిషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని