సజ్జల ఆదేశాలతోనే నాడు అనపర్తిలో పోలీసుల దాడి

వైకాపా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో గతేడాది ఫిబ్రవరిలో రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ భక్తవత్సలం, అనపర్తి సీఐ వి.శ్రీనివాస్, ఎస్సై పి.అప్పారావు తనపై దాడి చేసి హతమార్చాలని చూశారని ‘చంద్రదండు’

Published : 09 Jul 2024 06:05 IST

చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు
నన్ను హతమార్చడానికీ అధికారుల ప్రయత్నం
పోలీసులకు ‘చంద్రదండు’ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడి ఫిర్యాదు 

అనపర్తి సీఐ శివగణేష్‌కు ఫిర్యాదు చేస్తున్న ప్రకాష్‌నాయుడు

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో గతేడాది ఫిబ్రవరిలో రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ భక్తవత్సలం, అనపర్తి సీఐ వి.శ్రీనివాస్, ఎస్సై పి.అప్పారావు తనపై దాడి చేసి హతమార్చాలని చూశారని ‘చంద్రదండు’ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్‌ నాయుడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీఐ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. 2023 ఫిబ్రవరి 17న అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు పోలీసులు సృష్టించిన అడ్డంకులు, తనపై జరిగిన దాడిని వివరిస్తూ సీఐ శివగణేష్‌కు ఫిర్యాదు అందజేశారు. సజ్జలతోపాటు అప్పటి డీఎస్పీ, సీఐ, ఎస్సైలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రకాష్‌నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ ‘చంద్రదండు పేరుతో చంద్రబాబుకు రక్షణగా వెళుతుంటాం. రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా నిరుడు ఫిబ్రవరి 17న అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన చేపట్టారు.

సజ్జల ఆదేశాలతో పోలీసులు బిక్కవోలు మండలం బలభద్రపురంలో బారికేడ్లు పెట్టి ఆయన్ను అడ్డుకున్నారు. వాహనాలనూ వెళ్లనీయకపోవడంతో ఆయన బలభద్రపురం నుంచి అనపర్తికి చీకటిలో కాలినడకన 7 కిలోమీటర్లు చేరుకున్నారు. చంద్రబాబు ప్రసంగించే వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో వేరే వాహనంపై నిల్చొని మాట్లాడుతుండగా విద్యుత్తు సరఫరా నిలిపేశారు. చాలామందిపై    లాఠీఛార్జి చేశారు. చంద్రబాబుపై భౌతిక దాడికి యత్నించగా చంద్రదండు సభ్యులం అడ్డుకున్నాం. సీఐ శ్రీనివాస్‌ నన్ను కొట్టడంతో కింద పడిపోయాను. డీఎస్పీ భక్తవత్సలం నా గొంతు నొక్కి అరవకుండా చేశారు. స్థానిక నాయకులు నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రి వారు ఎంఎల్‌సీ పత్రాలను స్టేషన్‌కు పంపించినా అనపర్తి పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయం ఇప్పుడు తెలియడంతో ఫిర్యాదు చేశాను’ అని చెప్పారు. నాటి ఘటనలో తమ ఆంక్షలు దాటి అనపర్తిలో సభ నిర్వహించారంటూ చంద్రబాబుతో పాటు వెయ్యి మందికిపైనే పోలీసులు కేసులు బనాయించడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని