మైనింగ్‌ దోపిడీ వివరాలు సిద్ధం చేయండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్‌ దోపిడీ.. ఆ పార్టీ నేతల దందాలు.. గనుల శాఖను అడ్డుపెట్టుకొని లీజుదారులపై సాగించిన వేధింపులు..

Published : 09 Jul 2024 05:06 IST

ఈనాడు, అమరావతి: గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్‌ దోపిడీ.. ఆ పార్టీ నేతల దందాలు.. గనుల శాఖను అడ్డుపెట్టుకొని లీజుదారులపై సాగించిన వేధింపులు.. నమోదు చేసిన విజిలెన్స్‌ కేసులు తదితర వివరాలను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో గనుల శాఖపై విడుదల చేయబోయే శ్వేతపత్రానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. తర్వాత నెల్లూరు జిల్లాలో సాగిన సిలికా శాండ్, క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రానైట్, రోడ్‌ మెటల్‌ లీజుదారులపై ఉద్దేశపూర్వకంగా భారీ జరిమానాలు విధించిన తీరు.. విజిలెన్స్‌ తనిఖీల పేరిట వేధింపులు.. ఇతర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఖనిజాలు, జిల్లాల వారీగా సాగిన దందాలను నివేదికలో పొందుపర్చాలని స్పష్టం చేశారు. సీనరేజ్‌ వసూళ్ల గుత్తేదారుల టెండర్లు, ఈ-వేలం పేరిట లీజుల కేటాయింపులో జరిగిన అక్రమాలు, పాత తేదీలతో వైకాపా నేతలకు లీజుల కేటాయింపు.. వంటివన్నీ అందులో ఉండాలని పేర్కొన్నారు. కొత్తగా ఇసుక విధానానికి మార్గదర్శకాలతో ఉత్తర్వు జారీ చేసినందున.. అక్రమాలకు తావు లేకుండా, ప్రజలందరికీ ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని