టీడీఆర్‌ బాండ్ల కుంభకోణాన్ని సీఐడీకి అప్పగించాలి

వైకాపా ప్రభుత్వం పాల్పడిన రూ.వేల కోట్ల టీడీఆర్‌ బాండ్ల కుంభకోణాన్ని సీఐడీకి అప్పగించాలని తెదేపా నేత బుద్దా వెంకన్న డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Published : 10 Jul 2024 04:50 IST

డీజీపీకి బుద్దా వెంకన్న ఫిర్యాదు

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వం పాల్పడిన రూ.వేల కోట్ల టీడీఆర్‌ బాండ్ల కుంభకోణాన్ని సీఐడీకి అప్పగించాలని తెదేపా నేత బుద్దా వెంకన్న డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులను శిక్షించాలని కోరారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ద్వారకా తిరుమలరావుకు మంగళవారం వినతిపత్రం ఇచ్చాక విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ సుమారు రూ.42 వేల కోట్లు దోచుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అదే దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ఇసుక, గనులు, మద్యం, భూదోపిడీ చేశారు. ఇవన్నీ కనిపించే కుంభకోణాలైతే, టీడీఆర్‌ బాండ్ల జారీ కనిపించని మోసం. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గజానికి రూ.2 వేలు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైకాపా నేతలు కొనుగోలు చేశారు. తర్వాత వాటి విలువను అమాంతం పెంచేశారు. గతంలో స్థలం విలువ ఎంతుంది? వైకాపా నాయకులు కొన్న తర్వాత ఎంత పెరిగింది? ఇందులో ఎవరు పాత్రధారి? సూత్రధారి? అన్న అంశాలను డీజీపీకి వివరించా. ఈ భారీ కుంభకోణంలో ఏ1 ముద్దాయి మాజీ సీఎం జగనే. మాజీ సీఎం పేషీ నుంచి కలెక్టర్లకు ఆదేశాలిచ్చి మరీ భూమి ధరలు పెంచేలా ఒత్తిడి తెచ్చారు. జగన్‌ దోచుకున్న రూ.వేల కోట్లు కట్టించే వరకు మా పోరాటం ఆగదు. డీజీపీ సానుకూలంగా స్పందించి ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగిస్తామని హామీనిచ్చారు’ అని బుద్దా వెంకన్న తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని