ముంబయి హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. నిందితుడి తండ్రి రాజేశ్‌ షాపై శివసేన చర్యలు

మహారాష్ట్రలోని ముంబయిలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వివాహిత మరణానికి కారణమైన కేసులో.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే చర్యలు చేపట్టారు.

Published : 11 Jul 2024 03:59 IST

పార్టీ శాసనసభా పక్ష ఉపనేత పదవి నుంచి తొలగింపు

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వివాహిత మరణానికి కారణమైన కేసులో.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే చర్యలు చేపట్టారు. శివసేన శాసనసభా పక్ష ఉపనేతగా ఉన్న రాజేశ్‌ షాను ఆ పదవి నుంచి తొలగించారు. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మృతురాలు కావేరి నఖ్వా కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రాజేశ్‌ షాను డిప్యూటీ నేత పదవి నుంచి తొలగించినప్పటికీ శివసేనలో సభ్యుడిగా కొనసాగనున్నట్లు సమాచారం. మరోవైపు నిందితుడు మిహిర్‌ షాకు కోర్టు ఈ నెల 16 వరకు పోలీసు కస్టడీ విధించింది.      

ఆ పబ్‌పైకి బుల్డోజర్‌..

ప్రమాదానికి ముందు మిహిర్‌ షా మద్యం తాగిన వైస్‌-గ్లోబల్‌ తపస్‌ బార్‌లోని కొంత భాగాన్ని బుధవారం ఎక్సైజ్‌ అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. ప్రభుత్వ నియమాలు పాటించకుండా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ, యువకులకు మద్యం సరఫరా చేస్తున్నారనే కారణంతో బార్‌ను కూల్చివేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. బార్‌ యజమానుల వద్ద సరైన లైసెన్సులు కూడా లేవని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని