కాంగ్రెస్‌ హామీలను అమలు చేయాలి

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్ని సత్వరమే అమలు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

Published : 11 Jul 2024 04:04 IST

రాష్ట్ర విస్తృత సమావేశంలో సీపీఎం డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌ -న్యూస్‌టుడే బాగ్‌లింగంపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్ని సత్వరమే అమలు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలనే అమలు చేశారని.. వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు, కౌలు రైతులకు రైతు భరోసా, రైతుబీమా నేటికీ వర్తింపజేయలేదని ఆక్షేపించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర విస్తృత సమావేశంలో సీపీఎం తీర్మానించింది. ‘ధరణి సమస్యల పరిష్కారం, భూముల హక్కుల కోసం లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. రుణమాఫీని ఆగస్టుకు పొడిగించడంతో బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వలేదు. పూరిళ్లలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారిపై పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి అక్రమకేసులు పెడుతున్నారు. ఇళ్లు కూల్చివేస్తున్నారు. ఇకనైనా అక్రమ కేసులు తొలగించి పట్టాలివ్వాలి. జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలి. విద్యుత్తు బిల్లుల వసూలును అదానీ కంపెనీకి అప్పజెప్పడాన్ని విరమించుకోవాలి’ అని సీపీఎం కోరింది. 

పన్నుల్లో 5 శాతం కేటాయించాలి: రాఘవులు

సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లే ఆదాయంలో రాష్ట్రాభివృద్ధికి ఐదు శాతం కేటాయించాలన్నారు. తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు భాజపా కుట్రలు చేస్తోందని.. దీన్ని సమష్టిగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకున్న భాజపా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆ పార్టీని నిలువరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు ఎస్‌.వీరయ్య, జ్యోతి, వీరయ్య, మల్లులక్ష్మి, అబ్బాస్, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని