సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమని ప్రభుత్వ విప్, డోర్నకల్‌ ఎమ్మెల్యే డా.రామచంద్రునాయక్‌ అన్నారు.

Published : 11 Jul 2024 04:05 IST

ప్రభుత్వ విప్‌ డా.రామచంద్రునాయక్‌ 

హైదరాబాద్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమని ప్రభుత్వ విప్, డోర్నకల్‌ ఎమ్మెల్యే డా.రామచంద్రునాయక్‌ అన్నారు. భారాస నేతలు గాదరి కిశోర్, బాల్క సుమన్, గువ్వల బాలరాజులు సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాలులో మాట్లాడారు. సీఎం రేవంత్‌ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఓర్వలేక తమ పార్టీ నేతలతో సంస్కార హీనంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాసను ప్రజలు నామరూపాల్లేకుండా చేస్తారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారాస నేతలు బాల్క సుమన్, గాదరి కిశోర్‌లు క్షమాపణ చెప్పాలని ఎస్సీ కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ప్రీతం, పీసీసీ ప్రధాన కార్యదర్శులు చారగొండ వెంకటేశ్, కైలాష్‌ నేత, అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ డిమాండ్‌ చేశారు. వారు బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధర్నాలు, దీక్షలు చేస్తున్నది నిజమైన నిరుద్యోగులు కాదని, బయటి వారితో ఆందోళనలు చేయిస్తున్నారన్నారు. 

ప్రతి జిల్లాలో స్టేడియానికి 12 ఎకరాలు కేటాయించాలి: వీహెచ్‌

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో స్టేడియం కోసం 12 ఎకరాలు కేటాయించి క్రీడలను ప్రోత్సహించాలని, బడ్జెట్‌లోనూ నిధులు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కోరారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. తనకు సికింద్రాబాద్‌ టికెట్‌ ఇస్తే తప్పకుండా గెలిచే వాడినని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని