Chandrasekhar: చంద్రబాబును దించేసి కేసీఆర్‌ సీఎం అవ్వాలనుకున్నారు: చంద్రశేఖర్‌

కేసీఆర్‌కు ఉన్నంత అధికార దాహం మరెవ్వరికీ లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చంద్రబాబును దించేసి ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా ఆశించారని భాజపా నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఈ విషయం చంద్రబాబుకు

Updated : 03 Jun 2022 13:53 IST

ఉమ్మడి రాష్ట్రంలోనే కేసీఆర్‌కు అధికార దాహం
భాజపా నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: కేసీఆర్‌కు ఉన్నంత అధికార దాహం మరెవ్వరికీ లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చంద్రబాబును దించేసి ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా ఆశించారని భాజపా నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియడంతో కుట్రకు తెరపడిందన్నారు. ఉద్యమ సమయంలో తనను ముఖ్యమంత్రిని చేస్తానని, మధుసూదనాచారి సహా చాలామందిని మంత్రుల్ని చేస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ‘అమరుల యాదిలో... తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సభ’లో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తెదేపా ప్రభుత్వంలో నేను, కేసీఆర్‌ ఒకేసారి మంత్రులం అయ్యాం. రెండోసారి కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రి పదవివ్వలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉంటూ కేసీఆర్‌ రాజకీయ యుద్ధం ప్రకటించారు. ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారు. కేసీఆర్‌, నేను, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరికొందరం కలిశాం. 3, 4 నెలలు చర్చలు జరిగాయి. 60 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. ఈ సంఖ్య చాలు.. గవర్నర్‌ దగ్గరకు వెళదామని కేసీఆర్‌ అన్నారు. 61వ ఎమ్మెల్యేగా వచ్చిన జ్యోతుల నెహ్రూ అక్కడి నుంచి చంద్రబాబు వద్దకు వెళ్లడంతో ఆ ప్రణాళిక బెడిసికొట్టింది’ అని చంద్రశేఖర్‌ వెల్లడించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయకుండా కేసీఆర్‌ ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని