మాఫియాల అడ్డాగా ఏపీ

ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని భాజపా

Updated : 08 Jun 2022 07:02 IST

భూమి, ఇసుక, మద్యం అన్నింటా దోపిడీ

రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం

రాష్ట్రంలో మాతృభాష తెలుగుకు అన్యాయం

వైకాపా పోవాలి.. భాజపా రావాలి

ఇదే మా నినాదం

‘గోదావరి గర్జన’ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా

ఈనాడు డిజిటల్‌- రాజమహేంద్రవరం, ఈనాడు- కాకినాడ, న్యూస్‌టుడే- దేవీచౌక్‌: ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తోందని, పంచాయతీ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం నిస్తేజంలోకి వెళ్లిపోవడంతో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఈ పరిస్థితిని చూస్తూ ఊరుకోవద్దని, వైకాపాకు ఉద్వాసన చెప్పి ప్రజలు భాజపాను గెలిపించాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ‘గోదావరి గర్జన’ సభలో నడ్డా ప్రసంగించారు. ‘వైకాపా పోవాలి.. భాజపా రావాలి’ అని నినాదాలు చేసి సభికులతోనూ చేయించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కమలం గుర్తుపైనే ఓటు వేయాలని, మోదీ సుపరిపాలన రాష్ట్రానికీ తేవాలని పిలుపునిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదు, ఏ పెట్టుబడీ రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ దృష్టి ఇసుక, లిక్కర్‌, భూ మాఫియాకే పరిమితమైంది. ఈ ప్రభుత్వం పోవాలి. డబుల్‌ ఇంజిన్‌ పాలన ఏపీలోనూ రావాల’ని ఆకాంక్షించారు. 2014లో మోదీ ఇచ్చిన అవకాశాన్ని తెదేపా కాలదన్నుకుందనీ, వారినీ సాగనంపాలని సూచించారు. ఏపీలో విపక్షాలపై కక్ష సాధింపులు పెరిగాయని, అప్రజాస్వామిక నిర్బంధం కొనసాగుతోందని నడ్డా ఆరోపించారు. కేంద్రం జాతీయ విద్యా విధానం ద్వారా మాతృభాషలకు ప్రాధాన్యమిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాతృభాష తెలుగుకు అన్యాయం జరుగుతోందని నడ్డా ఆవేదన వ్యక్తంచేశారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రార్థనా స్థలాలపై దాడులు ఎక్కువయ్యాయి. కుటుంబ ప్రయోజనాల కోసం శాంతి సామరస్యాలను పణంగా పెట్టారు. ప్రతీకార చర్యలు పెరిగాయి’ అని మండిపడ్డారు. 2014కి ముందూ.. తర్వాత పరిస్థితిని పథకాల వారీగా వివరించారు. ‘అప్పట్లో పాలసీలు, కార్యక్రమాలు కాగితాలకే పరిమితమైతే.. మోదీ ప్రధాని అయ్యాక ప్రగతి పరుగులు పెడుతోంది. అవినీతి రహిత అభివృద్ధిలో ప్రపంచానికే మార్గదర్శకంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోంది.  ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి దేశ ఆర్థిక వ్యవస్థ ఎదగాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యం’ అని నడ్డా వివరించారు. ‘వ్యవసాయ బడ్జెట్‌ 2013-14లో రూ.21 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.1.24 లక్షల కోట్లకు పెరిగింది’ అని గణాంకాలు వివరించారు.

సంక్షేమ పథకాలపై ఆరా..
రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన నడ్డా కేంద్ర ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. తర్వాత ఓ హోటల్‌లో కేంద్ర ప్రభుత్వ పురస్కారాల గ్రహీతలతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ ముఖ్యనాయకులతో మాట్లాడారు. బహిరంగ సభలో నడ్డా ప్రసంగాన్ని ఎమ్మెల్సీ మాధవ్‌ తెలుగులో అనువాదం చేశారు. పర్యటనలో భాజపా నేతలు పురందేశ్వరి, సునీల్‌ దేవధర్‌, జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్‌రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, అంబికా కృష్ణ, రాధాకృష్ణ, రామ్‌కుమార్‌, అయ్యాజీ వేమ తదితరులు పాల్గొన్నారు.


మంత్రులు, ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు

- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూములు, ఇసుక, మట్టి ఇతర వనరులన్నీ దోచేస్తున్నారు. కాలువలు, చెరువులు కబ్జా చేస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన కోనసీమ జిల్లాలో ఓట్ల రాజకీయాలతో చిచ్చురేపారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. ఏ అంశంలోనూ వైకాపా ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి లేదు. రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు పెరిగాయి. మహిళలకు భద్రత లేదు. మంత్రులు సామాజిక చైతన్య యాత్రలు చేస్తున్నారు, కాని దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ, తెలంగాణల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ కలిపి రైతులను దోచేస్తున్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్రంలో అవినీతి లేదు. వారసత్వ రాజకీయాలను భూస్థాపితం చేసేది భాజపానే. ఏపీలోనూ కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తాం. రాష్ట్రంలో రాజకీయాలను ప్రజా సంక్షేమానికి కాకుండా వైకాపా కుటుంబ సంక్షేమానికి వాడుకుంటోంది. నాడు-నేడు పేరుతో విద్యను ఉద్ధరిస్తామని చెప్పినా.. పదో తరగతి పరీక్షల్లో రెండు లక్షల మంది ఫెయిలయ్యారు. పోలవరం పూర్తికాకపోవడానికి తెదేపా, వైకాపా ప్రభుత్వాలే కారణం. మోదీ ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఇచ్చినా పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రంలో నిరుద్యోగిత పెరిగినా ఉద్యోగ ప్రకటనలూ లేవు.


ఏపీ స్వర్ణాంధ్రగా మారాలి: సినీనటి జయప్రద

అప్పులప్రదేశ్‌గా మారిన ఆంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి జేపీ నడ్డా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని రూ.లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన వైకాపా ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదు. రాష్ట్రంలో అన్నదాతలు సుఖంగా లేరు. అన్నదాతకే అన్నంలేని పరిస్థితి నెలకొంది. దీనిపై రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఆడపిల్లలు బయటకు వెళ్తే సురక్షితంగా రాగలరా అన్నది ప్రశ్నార్థకమే. అత్యాచారాలు అరికట్టడానికి, న్యాయం చేయడానికి ఎవరూ లేరు. ఆంధ్ర- ఉత్తర్‌ప్రదేశ్‌ నాకు రెండు కళ్లు. కొన్ని పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది. నన్ను క్షమించండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని