బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రవీణ్‌కుమార్‌

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ప్రధాన సమన్వయకర్తగా ఉన్న ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి నిర్ణయించారు. ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో

Published : 10 Jun 2022 05:12 IST

 నేడు బాధ్యతల స్వీకరణ

 ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బహిరంగసభ

ఈనాడు, హైదరాబాద్‌: బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ప్రధాన సమన్వయకర్తగా ఉన్న ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి నిర్ణయించారు. ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే సభలో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి, ఎంపీ రాంజీ గౌతమ్‌ సమక్షంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దిల్లీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రవీణ్‌కుమార్‌ అక్కడి నుంచి పార్టీ అభిమానులతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వరకు ర్యాలీగా వస్తారు. అనంతరం 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌ సర్వీసెస్‌కు రాజీనామా చేసి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆయన బీఎస్పీలో చేరి పార్టీ ప్రధాన సమన్వయకర్తగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టారు. మార్చి 6న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో ప్రారంభించిన ఈ యాత్ర ఇప్పటి వరకు 86 రోజుల పాటు దాదాపు 18 నియోజకవర్గాల్లో కొనసాగింది. గ్రామాల్లోనే నిద్రించి, అక్కడే భోజనాలు చేస్తూ తన యాత్ర కొనసాగించారు. ఈ నెల 7న దిల్లీకి వెళ్లిన ఆయన గురువారం పార్టీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ ప్రధాన నాయకుల్ని కలిసి తెలంగాణలో పార్టీ బలోపేతం, అధికారంలోకి రావడం అంశాలపై చర్చించారు.

దోపిడీ పాలన విముక్తి కోసం కృషి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన ప్రవీణ్‌కుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పుట్టెడు దుఖంలో ఉన్నారని, దోపిడీ పాలకుల నుంచి విముక్తి కల్పించడం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ పోరాటంలో త్యాగం ఒకరిది... భోగం ఒకరిది అయిందని, రాష్ట్రాన్ని ఇక అందరి తెలంగాణగా మార్చుతామని చెప్పారు. పార్టీ అధినేత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానన్నారు. రాష్ట్రంలో తన బహుజన రాజ్యాధికార యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లోకి వెళ్లగలిగామని, కరెంటు లేని ప్రాంతాల్లో సైతం తిరిగామన్నారు. ఇప్పటి వరకు 650 గ్రామాల్లో పాదయాత్ర చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక తన యాత్ర కొనసాగుతుందని, మొత్తం 300 రోజులు ఈ యాత్ర ఉంటుందని ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని