బందరు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
మాజీ మంత్రి పేర్ని నానికి, ఎంపీ బాలశౌరికి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి ఎంపీ వెళ్తుండగా.. పేర్ని నాని అనుచరులు ‘గోబ్యాక్ ఎంపీ’ అంటూ అడ్డుపడటం.. దీనిపై ఎంపీ ‘బందరు నీ అడ్డానా..!’ అంటూ ప్రశ్నించడంతో
ఎంపీని అడ్డుకున్న పేర్ని నాని అనుచరులు
బందరు నీ అడ్దా కాదంటున్న బాలశౌరి
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే- మచిలీపట్నం (కోనేరుసెంటరు): మాజీ మంత్రి పేర్ని నానికి, ఎంపీ బాలశౌరికి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి ఎంపీ వెళ్తుండగా.. పేర్ని నాని అనుచరులు ‘గోబ్యాక్ ఎంపీ’ అంటూ అడ్డుపడటం.. దీనిపై ఎంపీ ‘బందరు నీ అడ్డానా..!’ అంటూ ప్రశ్నించడంతో వీరిమధ్య ఇన్నాళ్లూ చాపకింద నీరులా ఉన్న గొడవలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ముస్లింల శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని కొందరు స్థానికులు ఎంపీని శుక్రవారం కోరారు. దాంతో అక్కడకు ఆయన వెళ్తుండగా.. పేర్ని నాని ముఖ్య అనుచరుడైన 33వ డివిజన్ కార్పొరేటర్ అస్గర్‌అలీ, అతని వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వస్తే అడ్డుకోవడం ఏంటని ఎంపీ ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగింది. పోలీసులు కార్పొరేటర్ వర్గీయులను అక్కడ్నుంచి పంపేశారు. నిరసన గురించి ముందే తెలిసిన ఓ పోలీసు అధికారి ఆ విషయం ఎంపీకి చెప్పి, శ్మశానం వద్దకు వెళ్లొద్దని కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ తన నియోజకవర్గంలో సమస్య పరిశీలనకు వెళ్తుంటే.. అడ్డుకునే అధికారం ఎవరికీ ఉండదన్నారు. శ్మశానవాటికను పరిశీలించాలని ఎంపీ బాలశౌరి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోగా.. ప్రత్యర్థి వర్గం ముందస్తు వ్యూహంతోనే ఆయన్ను అడ్డుకుంది. ఎంపీ గోబ్యాక్ అంటూ అప్పటికప్పుడు బ్యానర్లు ప్రత్యక్షం కావడంతో బాలశౌరి అవాక్కయ్యారు.మూడేళ్లుగా బాలశౌరి, పేర్ని నాని కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. కార్యకర్తలందరినీ నాని తన గుప్పెట్లో ఉంచుకున్నారు. ఆయన మంత్రి పదవి పోయాకే.. ఎంపీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
తగ్గేదే లేదు.. బందరులోనే ఉంటా: బాలశౌరి
‘బందరు మీ అడ్డానా? ఎంపీగా నన్ను మూడేళ్ల నుంచి ఒక్క కార్యక్రమానికీ పిలవకపోవడమేంటి? ఇక నుంచి బందరులోనే ఉంటా. ఎంపీ అంటే ఏంటో చూపిస్తా’ అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. సొంత పార్టీ ఎంపీనే మచిలీపట్నానికి రానివ్వకుండా అడ్డుకుంటారా? వేరే పార్టీ ఎంపీ సుజనాచౌదరి, భాజపా నేత కామినేని శ్రీనివాస్ లాంటివారితో కలిసి పాల్గొన్నారు. సీఎంపై, ప్రభుత్వంపై సుజనా చౌదరి వ్యాఖ్యలను మీరు ఖండించకపోవమేంటి? నన్ను బందరుకు రాకూడదంటున్నారు. బందరు తెదేపా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వారానికోసారి ఎందుకు కలుస్తున్నారు? ఇక నుంచి నేను బందరులోనే ఉంటా.. ఎవరేం చేస్తారో చూస్తా.. ఎంపీ అంటే ఏంటో చూపిస్తా’ అని వెల్లడించారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో బాలశౌరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల సమయం నుంచే అంటీముట్టనట్టుగా ఉన్న నాని-బాలశౌరి సంబంధాలు నానికి మంత్రి పదవి దక్కాక మరింత దెబ్బతిన్నాయి. కీలకమైన బందరు పోర్టు, వైద్యకళాశాల, హార్బర్ అభివృద్ధి వంటి అంశాల్లోనూ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కీలక విషయాల్లోనూ కనీస సంప్రదింపులు లేకపోవడం పట్ల అసహనంగా ఉంటున్న ఎంపీ.. శుక్రవారం నాటి ఘటనతో తనలోని ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. పార్టీలో ఆధిపత్యం విషయంలో ఇప్పటివరకూ గుట్టుగా ఉన్న విభేదాలు తెరపైకి రావడంతో భవిష్యత్ పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..