KTR: ప్రశాంత్‌ కిశోర్‌ సర్వేనే టికెట్లకు ఆధారం

ప్రశాంత్‌కిశోర్‌ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నారని, ఆ నివేదికల ఆధారంగానే టికెట్లు దక్కుతాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లు తెలిసింది.

Updated : 12 Jun 2022 07:56 IST

గెలుపు గుర్రాలకే కేటాయింపు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతల భేటీలో కేటీఆర్‌

ఈటీవీ, ఖమ్మం: ప్రశాంత్‌కిశోర్‌ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నారని, ఆ నివేదికల ఆధారంగానే టికెట్లు దక్కుతాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ముఖ్యనేతలతో శనివారం అంతర్గతంగా నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఖమ్మం పర్యటన అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో విందు తర్వాత నేరుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌ ముఖ్య నేతలతో భేటీఅయ్యారు. విశ్వసనీయ సమావేశం మేరకు ఆయన ఏమన్నారంటే.. ‘‘వచ్చే ఎన్నికల్లో మొహం చూసి బొట్టుపెట్టే పరిస్థితి ఉండదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేతలందరూ సిద్ధంగా ఉండాలి. అవసరమైన చోట కొన్ని మార్పులు తప్పవు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం. టికెట్లు రాని వారిని పార్టీ వదులుకోబోదు. విభేదాలు పక్కనబెట్టి నాయకులంతా సఖ్యతతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలిచేలా కలిసి పనిచేయాలి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుభవం ఉపయోగించుకోవాలి. జనంలో ఉన్న పొంగులేటి వంటి నాయకులను కలుపుకొని పోవాలి. రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఈ నెల 18న ఖమ్మం వస్తున్నారు. వారికి ఘనస్వాగతం పలికి అంతా కలిసికట్టుగా ఉన్నామన్న సందేశం ఇవ్వాలి. ప్రజల్లో పార్టీ పట్ల, సీఎం కేసీఆర్‌ పట్ల విశేషమైన ఆదరణ ఉంది. మళ్లీ అధికారం మనదే. కొంతమంది నేతలపై మాత్రమే వ్యతిరేకత ఉంది. అలాంటి వారు వెంటనే తమ పద్ధతి మార్చుకోవాలి. ప్రతి నాయకుడు పోలీస్‌ కాన్వాయ్‌తో వెళ్తుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందరూ తగ్గించుకోవాలి. అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొని పార్టీ కార్యక్రమాలు చేపట్టాలి. 

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర

తెరాస జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించబోతోంది. దీనికోసం ఈ నెల 17 వరకు రాష్ట్రస్థాయి నేతలతో సీఎం సమాలోచనలు జరుపుతారు. వారం రోజుల్లో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి ముఖ్య నేతలను పిలుస్తారు’ అని కేటీఆర్‌ మాట్లాడినట్లు సమాచారం.

సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేదర్‌రెడ్డి, రాములునాయక్‌, హరిప్రియ, జడ్పీ ఛైర్మన్లు కమల్‌ రాజు, కనకయ్యతో పాటు మాజీలు హాజరయ్యారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హాజరుకాలేదు. అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పల్లా, తాతా మధుసూదన్‌ రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని