Maharashtra Politics: ‘మహా’ సంక్షోభం

మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను సూరత్‌లోని శిబిరానికి తరలించడంతో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా

Updated : 22 Jun 2022 07:44 IST

పతనం అంచున ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం!

మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటు

సూరత్‌లో శిబిరానికి రెబల్‌ఎమ్మెల్యేల తరలింపు

అసమ్మతి నేతతో ఫోన్లో మాట్లాడిన మహారాష్ట్ర సీఎం

సర్కారును రక్షించుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ ప్రయత్నాలు

ఏక్‌నాథ్‌ ముందుకొస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనన్న భాజపా

ముంబయి/సూరత్‌

మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను సూరత్‌లోని శిబిరానికి తరలించడంతో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. దిన దిన గండంగా కొనసాగుతున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అసమ్మతి నేతతో ఠాక్రే ఫోన్లో మాట్లాడినా తుది ఫలితమేమిటో తెలియరాలేదు. తిరుగుబాటు వర్గం డిమాండ్లు ఏమిటో కూడా వెల్లడి కాలేదు. మరోవైపు తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా యత్నిస్తోంది. ఏక్‌నాథ్‌ శిందే నుంచి ప్రతిపాదన వస్తే ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ తెలిపారు. ఇంకోవైపున ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ మంగళవారం దిల్లీలో అగ్రనేతలతో భేటీ కావడం గమనార్హం. 2019 నవంబరులో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దానిని కూల్చడానికి ప్రయత్నించడం ఇది మూడోసారని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ధ్వజమెత్తారు. తాజా సంక్షోభాన్ని శివసేన అంతర్గత విషయంగా పేర్కొన్న ఆయన...ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమస్యను అధిగమించగలరన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్‌ కూడా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వ భవితవ్యంపై ఆశాభావం వ్యక్తం చేసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను సురక్షితమైన శిబిరాలకు తరలిస్తున్నాయి. అసంతృప్త నేత ఏక్‌నాథ్‌ శిందేను పార్టీ శాసనసభా పక్షనేత పదవి నుంచి శివసేన తొలగించింది. ఆయన స్థానంలో ఎమ్మెల్యే అజయ్‌ చౌదరిని నియమించింది. అధికారం కోసం మోసం చేసే వ్యక్తిని కాదంటూ ఏక్‌నాథ్‌ శిందే ట్వీట్‌ చేశారు. శిబిరానికి తరలి వెళ్లిన తర్వాత ఆయన నుంచి వచ్చిన తొలి స్పందన ఇది. ‘బాల్‌ ఠాక్రేకు మేం విధేయులమైన శివ సైనికులం. అధికారం కోసం మేం మోసం చేయం. బాలాసాహెబ్‌, ఆనంద్‌ దిఘే నేర్పించిన హిందుత్వ పాఠాలను మరిచిపోం’ అని మరాఠీలో ట్వీట్‌ చేశారు. శాసనసభా పక్షనేత హోదా నుంచి తప్పించిన నేపథ్యంలో.. ట్విటర్‌ బయో నుంచి ‘శివసేన’ అన్న పదాన్ని శిందే తొలగించారు.

శిబిరంలో ఎంతమంది ఉన్నారు?

శిందే తిరుగుబాటుతో ఎంవీఏ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఆయన వెంట 14 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. సూరత్‌లోని హోటల్‌లో ఏర్పాటైన శిబిరంలో ఎంత మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయంపై స్పష్టత రాలేదు. శిందేతో కలిపి 23 మంది అక్కడ ఉండవచ్చని కొందరు చెబుతుండగా...ఆ సంఖ్య 25 నుంచి 30 వరకూ ఉండవచ్చని మరో అంచనా. మంగళవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ముంబయిలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశానికి కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీకి శివసేన నుంచి 56 మంది ఎమ్మెల్యేలు ఎన్నికకాగా ఒకరు చనిపోవడంతో ప్రస్తుతం 55 మంది ఉన్నారు. 

అసెంబ్లీలో ఎవరి బలమెంత?

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గాను ప్రస్తుతం 287 మంది సభ్యులున్నారు. అధికార ఎంవీఏ(శివసేన-55, ఎన్సీపీ-53, కాంగ్రెస్‌-44) కూటమి సొంత బలం 152 కాగా స్వతంత్ర, చిన్న పార్టీల ఎమ్మెల్యేలు 15 మంది మద్దతిస్తున్నారు. విపక్ష భాజపాకు 106 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌, స్వాభిమాని పక్ష, రాష్ట్రీయ సమాజ్‌ పార్టీ, జన సురాజ్య పార్టీ, మరో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి పది మంది మద్దతిస్తుండడంతో కమలం పార్టీ బలం 116గా ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 144 మంది సభ్యుల మద్దతు అవసరం. శిందే వెంట కనీసంగా 30 మంది వస్తేనే భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే శిందే వెంట 37 మంది(2/3 వంతు) సభ్యులు ఉండాలి.

చకచకా పావులు కదిపిన శిందే

మహారాష్ట్ర శాసనమండలిలోని 10 స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఆ ఎన్నికల్లో అధికార ఎంవీఏ భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్సీపీలు రెండేసి సీట్లలో, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించాయి. విపక్ష భాజపా సొంతంగా అయిదు స్థానాలను గెలుచుకోగలిగింది. కమలం పార్టీకి నలుగురు అభ్యర్థులను గెలిపించుకోగల సంఖ్యా బలం(106) మాత్రమే ఉన్నప్పటికీ అయిదుగురిని బరిలోకి దించి అన్నింటా విజయం సాధించింది. కూటమిలోని మూడు పక్షాలు కలిసి (రెండేసి సీట్ల చొప్పున) ఆరు స్థానాల్లో పోటీ చేసినా అయిదుగురే విజయం సాధించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పక్కనే ఉన్న ఏక్‌నాథ్‌ శిందే ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారని శివసేన నేత ఒకరు తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు బసచేసిన సూరత్‌లోని హోటల్‌ వద్ద 400 మందికి పైగా పోలీసులతో గుజరాత్‌ ప్రభుత్వం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఎవరీ ఏక్‌నాథ్‌!

మహారాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ శిందే... అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నేత. ఒకప్పుడు ఆటో రిక్షా నడిపి జీవనం సాగించిన పరిస్థితి ఆయనది. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఆనంద్‌ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో పార్టీ కిసాన్‌నగర్‌ శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1997లో ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఠాణె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో రాష్ట్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి  శాఖ మంత్రి. శివసేన శాసనసభా పక్షనేతగానూ ఉన్న శిందేను తాజా వివాదంతో ఆ పదవి నుంచి తొలగించారు.

తిరుగుబావుటా ఎందుకు!

శివసేనలో బలమైన నేతగా ఉన్న ఏక్‌నాథ్‌ శిందే(58) తిరుగుబాటుకు నాలుగు ప్రధాన కారణాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

* ప్రభుత్వ బాధ్యతలన్నీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఒక్కరే చూసుకుంటున్నారని, ఇది శిందేకు నచ్చలేదని సమాచారం. మహా వికాస్‌ అఘాడీ ఏర్పడిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ఏక్‌నాథ్‌.. శివసేన శాసనసభాపక్ష నేతగా ఎంపికవడంతో సీఎం పదవి వస్తుందని ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఆ పదవిని ఉద్ధవ్‌ చేపట్టారు.

* ఎంపీ సంజయ్‌ రౌత్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరగడం ఏక్‌నాథ్‌ శిందేకు నచ్చట్లేదు.

* సీఎం పదవిని చేపట్టిన ఉద్ధవ్‌ తన తనయుడిని కేబినెట్‌లోకి తీసుకోవడం, తర్వాతి సీఎం ఆయనే అంటూ పరోక్షంగా ప్రచారాలు చేయించడంపై ఏక్‌నాథ్‌ ఆగ్రహంతో ఉన్నారు.

* రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల తన ప్రతిష్ఠ దిగజారిపోతోందని శిందే భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని