పట్టు బిగించిన శిందే

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరింది. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ శిందే శిబిరానికి చేరుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తిరుగుబాటు వర్గం డిమాండ్‌ మేరకు మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమేనని శివసేన ప్రకటించింది.

Updated : 24 Jun 2022 06:25 IST

తిరుగుబాటు శిబిరంలో పెరుగుతున్న సందడి

గువాహటికి చేరుకున్న మరికొందరు శివసేన ఎమ్మెల్యేలు

మహారాష్ట్రలో కొనసాగుతున్న హైడ్రామా

ముంబయి/గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరింది. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ శిందే శిబిరానికి చేరుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తిరుగుబాటు వర్గం డిమాండ్‌ మేరకు మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమేనని శివసేన ప్రకటించింది. అయితే, అసమ్మతి ఎమ్మెల్యేలందరూ ముంబయికి వచ్చి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో మాట్లాడాలని షరతు విధించింది. ఠాక్రే ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు చివరి వరకూ యత్నిస్తామని ఆ కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్‌ స్పష్టం చేశాయి. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే శిబిరం బలం గురువారం మరింత పెరిగింది. ఆయన వెంట 46 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. వీరిలో 37 మంది శివసేన రెబెల్స్‌ కాగా మిగిలిన వారు స్వతంత్రులు. వీరంతా గువాహటిలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో మకాం వేశారు. శివసేనకు మహారాష్ట్ర శాసనసభలో 55 మంది సభ్యుల బలం ఉంది. మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు శిందే వైపు చేరితే.. చట్టబద్ధంగా శాసనపక్ష హోదా పొందే అవకాశం రెబల్స్‌కు లభిస్తుంది. అయితే, సీఎం ఠాక్రే వర్గంలో 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, మిగిలిన 42 తన మద్దతుదారులేనని శిందే చెబుతున్నారు. ఈ వాదనలకు బలం చేకూర్చేలా గురువారం ఉదయం నలుగురు, సాయంత్రం ఆరుగురు ఎమ్మెల్యేలు సూరత్‌ మీదుగా గువాహటికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలని, మిగతా వారు స్వతంత్రులని సమాచారం. కొందరు శివసేన ఎంపీలు కూడా ఏక్‌నాథ్‌ శిందే వర్గం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా ముంబయికి రావటం చర్చనీయాంశమయ్యింది. ఆమె మాల్దీవుల్లో ఉన్న కుమార్తెను కలుసుకోవడానికి వెళ్తూ మార్గమధ్యలో ముంబయిలో కొద్ది సేపు ఆగారని కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇచ్చింది.

ముంబయి రండి మాట్లాడుకుందాం: సంజయ్‌ రౌత్‌

తిరుగుబాటు వర్గం మెట్టు దిగకపోవడంతో శివసేన గురువారం తన వ్యూహాన్ని మార్చింది. ఎంవీఏ నుంచి బయటకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ అందుకు ఓ షరతు విధించారు. 24 గంటల్లో అసమ్మతి ఎమ్మెల్యేలు ముంబయికి తిరిగి రావాలన్నారు. ‘మీరు నిజంగా శివ సైనికులైతే పార్టీని విడిచిపెట్టరు. మీ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ట్విటర్‌, వాట్సాప్‌ ద్వారా లేఖలు రాయొద్దు. 24 గంటల్లోగా ముంబయికి వస్తే సీఎం ఠాక్రేతో చర్చిద్దాం. రెబల్‌ ఎమ్మెల్యేలు హిందుత్వ గురించి మాట్లాడుతున్నారు. అఘాడీ నుంచి శివసేన తప్పుకోవాలని భావిస్తే ఆ విషయాన్ని ముంబయికి వచ్చి చెప్పండి. సమస్య ప్రభుత్వంతో అయినప్పుడు ఠాక్రేతో మాట్లాడండి’ అని సంజయ్‌ రౌత్‌ సూచించారు. పార్టీ తలుపులు వారి కోసం తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనని తెలిపిన ఉద్ధవ్‌...ఆ తర్వాత అధికారిక నివాసాన్ని వీడి సొంతింటికి వెళ్లిన విషయం తెలిసిందే.

సర్కారు భవితవ్యం తేలాల్సింది అసెంబ్లీలోనే: శరద్‌పవార్‌

కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధమేనన్న సంజయ్‌ రౌత్‌ ప్రకటన తీవ్రతను తగ్గించేందుకు ఎంవీఏ భాగస్వామ్య పక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్‌ ప్రయత్నించాయి. అసమ్మతి ఎమ్మెల్యేలను ముంబయికి రప్పించేందుకే అలా చెప్పారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఠాక్రే ప్రభుత్వ భవితవ్యం అసెంబ్లీలోనే తేలుతుందని తెలిపారు. సభలో మెజారిటీని నిరూపించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏక్‌నాథ్‌ తిరుగుబాటు వెనుక భాజపా జాతీయ నాయకత్వం లేదన్న తమ పార్టీ నేత అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. భాజపా గురించి అతనికి బాగా తెలిసి ఉండకపోవచ్చని శరద్‌ పవార్‌ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులకు భయపడే చాలా మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు శిబిరానికి వెళ్లారని వ్యాఖ్యానించారు.

ఠాక్రే సర్కారు కూలిపోతే తాము విపక్షంలో కూర్చుంటామని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ తెలిపారు. ‘ముఖ్యమంత్రి పదవి శివసేనకు కేటాయించాం. వారు సొంత ఎమ్మెల్యేలలో ఎవరికైనా పదవి ఇచ్చుకోవచ్చు’ అని స్పష్టం చేశారు.

పొత్తులు శివసేన ఇష్టం: కాంగ్రెస్‌

ఎంవీఏ నుంచి వైదొలుగుతామన్న సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు తొలుత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. శివసేనతో కలిసే ఉంటామని, బలపరీక్షకూ సిద్ధమేనని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. వేరే వారితో పొత్తులు కుదుర్చుకోవాలంటే అది శివసేన ఇష్టమని తెలిపారు. కూటమిలో కొనసాగుతూనే ఐక్యంగా పోరాడుతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు.

13 మంది మినహా అంతా మావైపే: శిందే..

అసమ్మతి ఎమ్మెల్యేల నేత ఏక్‌నాథ్‌ శిందే మీడియాతో మాట్లాడారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 13 మంది మినహా అంతా తన వర్గం వారేనని ధీమా వ్యక్తం చేశారు. అసలైన శివసేన తమదేనని పేర్కొన్నారు. పార్టీ శాసనసభాపక్ష నేతను తానేనని తెలిపారు. అంతకుముందు గువాహటి హోటల్లో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గురువారం ఏక్‌నాథ్‌ శిందేను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ తరఫున నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయనకు అప్పగించారు. గువాహటిలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో వీరంతా గ్రూప్‌గా ఉన్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం.. తమపై చర్యలు తీసుకోకుండా మెజారిటీని నిరూపించుకునేందుకు శిందే సిద్ధమైంది. తనకు మద్దతుగా 37 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసిన తీర్మాన ప్రతిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు పంపించారు.

కిడ్నాప్‌ చేస్తే తప్పించుకు వచ్చా: ఎమ్మెల్యే నితిన్‌

తిరుగుబాటు శిబిరం నుంచి ముంబయికి తిరిగి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ తాను అపహరణకు గురైనట్లు ఆరోపించారు. శిందే శిబిరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. సూరత్‌ పోలీసులు పట్టుకున్నారని ఆరోపించారు. తనకన్నా ముందు ఎమ్మెల్యే ప్రకాశ్‌ అభిత్కర్‌ పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని తెలియగానే పారిపోయి వచ్చానని చెప్పారు. అయితే, ఆయన ఆరోపణలను రెబల్స్‌ దీటుగా తిప్పికొట్టారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి నవ్వుతూ ఉన్న ఫొటోలను విడుదల చేశారు. మరో ఎమ్మెల్యే కైలాశ్‌ పాటిల్‌ సైతం తనను మోసపూరితంగా సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. కిలోమీటర్‌ దూరం నడిచి అక్కడి నుంచి పారిపోయి వచ్చానని చెప్పారు.

ఠాక్రేకు అసమ్మతి ఎమ్మెల్యే లేఖ

తిరుగుబాటు శిబిరంలో ఉన్న ఎమ్మెల్యే సంజయ్‌ సిరాసత్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. ముఖ్యమంత్రిని కలవడానికి కూడా తమకు వీలు కాని పరిస్థితి ఏర్పడిందని, తమ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేని పరిస్థితిలో చిక్కుకుపోయామని ఆరోపించారు. అదే సమయంలో శిందే తమ వెంట నిలిచారని లేఖలో పేర్కొన్నారు.

తృణమూల్‌ నిరసన

మహారాష్ట్ర శాసనసభ్యులు బస చేసిన రాడిసన్‌ బ్లూ హోటల్‌ ముందు అస్సాం తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రిపున్‌ బొరా నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళన చేశారు. వరదల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యమంత్రి రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘ఓ జాతీయ పార్టీ సహాయం చేస్తామంది’

ముంబయిలోని శిందే కార్యాలయం ఓ వీడియోను విడుదల చేసింది. అందులో హోటల్లోని తన వర్గం ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్‌నాథ్‌ ప్రసంగిస్తున్నారు. ‘ఒక జాతీయ పార్టీ మన తిరుగుబాటును చరిత్రాత్మకం అని ప్రశంసించింది. ఎలాంటి సహాయమైనా చేస్తానని హామీ ఇచ్చింది. ఐక్యంగా ఉంటే విజయం మనదే. ఆ జాతీయ పార్టీ ఓ మహాశక్తి. పాకిస్థాన్‌ను ఓడించింది’ అని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని