Updated : 24 Jun 2022 06:32 IST

Presidential Election: ముర్ము కంటే ఎక్కువే చేశాను

గిరిజనుడిని కాకపోయినా వారి సంక్షేమానికి పాటుపడ్డాను

ప్రత్యేక వ్యూహంతో గెలుస్తాను

‘ఈటీవీ భారత్‌’ ముఖాముఖిలో యశ్వంత్‌ సిన్హా వ్యాఖ్యలు

దిల్లీ: తాను గిరిజనుడిగా పుట్టకపోయినా వారి కోసం ద్రౌపది ముర్ము కంటే ఎక్కువ సేవే చేశానని ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా చెప్పారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన ముర్ము గతంలో ఝూర్ఖండ్‌ గవర్నర్‌ సహా వివిధ హోదాల్లో ఉన్నప్పుడు ఆదివాసీల కోసం ఏమైనా చేసి ఉంటే ఆ వివరాలను బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. గురువారం ‘ఈటీవీ భారత్‌’తో, పీటీఐ వార్తాసంస్థతో వేర్వేరుగా ఆయన మాట్లాడారు. ఒక సామాజిక వర్గంలో జన్మించినంత మాత్రాన వారందరిపై ఆటోమేటిగ్గా ఛాంపియన్‌ అయిపోలేరని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రవేశపెట్టిన ఐదు బడ్జెట్లలోనూ బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసినట్లు చెప్పారు.

ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకే..

‘ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఏర్పడింది. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ముర్ము, సిన్హా ఎవరనేది పక్కనపెట్టి మేం ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధాంతాల మధ్య సమరంగా ఈ ఎన్నికలను చూడాలి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నేను కట్టుబడి ఉన్నాను. వాజ్‌పేయీ హయాంలో ఉన్న భాజపాకు, మోదీ హయాంలో భాజపాకు చాలా వ్యత్యాసం ఉంది. వాజ్‌పేయీ గొప్ప పార్లమెంటేరియన్‌, ప్రజాస్వామ్యవాది. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే భాగస్వామ్య పార్టీలతో పాటు, ప్రతిపక్షాలతోనూ చర్చలు జరిపేవారు. ఏకాభిప్రాయం సాధించేవారు. మోదీ సర్కారు అలాంటిది కాదు’ అని సిన్హా చెప్పారు. ప్రస్తుత భాజపాకు ఆనాటి భాజపాకు ఉన్న గుర్తింపు లేదని విమర్శించారు.

మాట్లాడేందుకు రాష్ట్రపతి భయపడకూడదు

రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడేందుకు భయపడితే కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణలో ఉండదని సిన్హా చెప్పారు. విజయం సాధించాలనే కృత నిశ్చయంతోనే బరిలో దిగినట్లు చెప్పారు. ప్రస్తుతం పలు పార్టీలు భాజపా వైపు మొగ్గినట్లు కనిపిస్తున్నా త్వరలో పరిస్థితులు మారుతాయన్నారు. 27న నామినేషన్‌ దాఖలు చేశాక బిహార్‌తో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా పర్యటించి, అన్ని పార్టీలనూ కలుస్తానని చెప్పారు. తమకు ప్రత్యేక వ్యూహం ఉందని, అదేమిటనేది ఇప్పుడు బయటపెట్టబోమని అన్నారు. ఇంతవరకు గిరిజన అభ్యర్థి రాష్ట్రపతిగా లేనట్లే తన పేరులోని వై అనే అక్షరంతో మొదలయ్యే రాష్ట్రపతి కూడా లేరని ‘ఈటీవీ భారత్‌’ ప్రశ్నకు సమాధానంగా సిన్హా చమత్కరించారు. విపక్షాల భేటీ తర్వాత పవార్‌, మల్లికార్జున ఖర్గే ముందుగా తనను సంప్రదించారని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని