హిందూపురం వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వైకాపాలో వర్గపోరు భగ్గుమంది. అధికార పార్టీ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన మెజార్టీ నాయకులు నడుపుతున్న అసమ్మతివర్గ రాజకీయాలు శుక్రవారం రణరంగాన్ని తలపించాయి.

Updated : 25 Jun 2022 10:24 IST

అసమ్మతి నేతలపై దూసుకొచ్చిన ఎమ్మెల్సీ ఇక్బాల్‌
వ్యతిరేక వర్గంపై అనుచరుల దాడులు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వైకాపాలో వర్గపోరు భగ్గుమంది. అధికార పార్టీ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన మెజార్టీ నాయకులు నడుపుతున్న అసమ్మతివర్గ రాజకీయాలు శుక్రవారం రణరంగాన్ని తలపించాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అనుచరులను వెంటబెట్టుకొని ప్రెస్‌క్లబ్‌లో తనకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తున్న సొంత పార్టీ నేతలపైనే తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాళ్లు, కుర్చీలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. రెండు రోజుల కిందట ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా వైకాపా మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి, హిందూపురం గ్రామీణ ఎంపీపీ రత్నమ్మ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీలో నాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎమ్మెల్సీ పీఏలు చేస్తున్న దందాలపైనా మాట్లాడారు. పీఏలను తొలగించకపోతే వారి అవినీతి, అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు. అందులో భాగంగానే ఎంపీపీ రత్నమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ వర్గీయులు అక్కడికి చేరుకుని ఎంపీపీని బెదిరించారు. అదే సమయంలో ఒకటో పట్టణ సీఐ ఇస్మాయిల్‌ అక్కడికి వచ్చి ఎంపీపీతో మాట్లాడి సర్దిచెప్పి పంపించేశారు. అనంతరం అటుగా ఇంటికి వెళ్తున్న అసమ్మతి వర్గ కౌన్సిలర్‌ ఇర్షాద్‌ ఇక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. ఎమ్మెల్సీ వర్గీయులు అతడిని దూషించడమే కాకుండా తీవ్రంగా కొట్టారు. పోలీసులు అడ్డుకొని ఇర్షాద్‌ను కాపాడారు. తమ కౌన్సిలర్‌పై దాడి చేసిన విషయం తెలుసుకొన్న అసమ్మతి వర్గంలోని 18 మంది కౌన్సిలర్లు, సీనియర్‌ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డి, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి తదితరులు సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌క్లబ్‌ వద్దకు వచ్చారు. పార్టీలో జరుగుతున్న దాడులను విలేకరులకు వివరించడానికి సమావేశం పెట్టారు. ఇది తెలుసుకొన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అనుచరులతో నేరుగా ప్రెస్‌క్లబ్‌లోకి దూసుకొచ్చారు. వారిని దూషించారు. మరోవైపు ఆయన అనుచరులు  రాళ్లు విసురుతూ, కిటికీలు, తలుపులను పగులగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో పరస్పరం దాడులకు దిగారు. ఎమ్మెల్సీ అనుచరులు దాడులు చేస్తున్నా అడ్డుకోకుండా సీఐ ఇస్మాయిల్‌ ఏజెంటులా వ్యవహరిస్తున్నారని స్థానిక నాయకులు మండిపడ్డారు. చివరకు ఎమ్మెల్సీ పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లారు. అసమ్మతి నేతలనూ పోలీసులు ఇళ్లకు పంపారు. అయితే ఎమ్మెల్సీ అనుచరుడు కార్తీక్‌... అసమ్మతి నాయకుడు రాంప్రసాద్‌ మీదకు రాయి విసరడంతో మళ్లీ వివాదం తలెత్తింది. పోలీసులు అప్రమత్తమై వారందరిని పంపించి వేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు