సమాజ్‌వాదీ కంచుకోటల్లో భాజపా పాగా

ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికార పీఠమెక్కి ఊపుమీదున్న భాజపా తాజాగా ఉప ఎన్నికల్లోనూ సత్తాచాటింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలుగా పేరున్న రాంపుర్‌, ఆజంగఢ్‌ పార్లమెంటు సీట్లను తన ఖాతాలో వేసుకుంది. త్రిపురలో

Published : 27 Jun 2022 06:35 IST

 రాంపుర్‌, ఆజంగఢ్‌ లోక్‌సభ సీట్లు కమలదళం వశం

త్రిపురలో 3 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీవే..

సంగ్రూర్‌లో ఆప్‌కు ఎదురుదెబ్బ

ఉప ఎన్నికల్లో రెండు సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్‌

లఖ్‌నవూ, అగర్తలా, ఈనాడు-దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికార పీఠమెక్కి ఊపుమీదున్న భాజపా తాజాగా ఉప ఎన్నికల్లోనూ సత్తాచాటింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలుగా పేరున్న రాంపుర్‌, ఆజంగఢ్‌ పార్లమెంటు సీట్లను తన ఖాతాలో వేసుకుంది. త్రిపురలో మొత్తం నాలుగు స్థానాలకుగాను మూడింటిని కమలదళం గెల్చుకుంది. మరోవైపు- పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీలోని రాజిందర్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవడం మాత్రం కేజ్రీవాల్‌ పార్టీకి ఊరటనిచ్చే విషయం. త్రిపురలో ఒక శాసనసభ నియోజకవర్గాన్ని గెల్చుకున్న కాంగ్రెస్‌.. ఝార్ఖండ్‌లోనూ ఓ సీటును దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మకూరు స్థానాన్ని వైకాపా గెల్చుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ సీట్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న జరిగిన పోలింగ్‌ ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.

యూపీలోని రాంపుర్‌ లోక్‌సభ స్థానంలో అధికార భాజపా అభ్యర్థి ఘనశ్యామ్‌ లోధీ.. ఎస్పీకి చెందిన మొహమ్మద్‌ ఆసిమ్‌ రజాపై 42,192 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఖాళీ చేసిన ఆజంగఢ్‌ స్థానంలోనూ కమలదళాన్నే విజయం వరించింది. అక్కడ ధర్మేంద్ర యాదవ్‌ (ఎస్పీ)పై దినేశ్‌లాల్‌ యాదవ్‌ నిరాహువా (భాజపా) 8,679 ఓట్ల తేడాతో గెలుపొందారు. వంశపారంపర్య, కుల రాజకీయాలు చేసే పార్టీలను తాము ఆమోదించబోమంటూ ఈ ఫలితాలతో ప్రజలు స్పష్టమైన సందేశమిచ్చారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. అయితే రాంపుర్‌లో భాజపా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ విజయం సాధించిందని ఆజంఖాన్‌ ఆరోపించారు. అక్కడ ఏదైనా అంతర్జాతీయ సంస్థ ఎన్నికలు నిర్వహించి.. తమ పార్టీ అభ్యర్థి ఓడిపోతే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానంటూ సవాలు విసిరారు. ఆజం ఖాన్‌కు ఆసిమ్‌ సన్నిహితుడు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన అనంతరం రాంపుర్‌లో ఆజంఖాన్‌, ఆజంగఢ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సంగతి గమనార్హం. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా.. తాజా ఫలితాలతో అందులో భాజపా వాటా 64కు పెరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూస్తే భాజపాకు ఈ విజయాలు గొప్ప ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు.

సంగ్రూర్‌లో సిమ్రన్‌జిత్‌సింగ్‌ మాన్‌ జయభేరి

పంజాబ్‌లో ఇటీవలే అధికార పగ్గాలు దక్కించుకున్న ఆప్‌కు ఉప ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. సంగ్రూర్‌ లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి గుర్మైల్‌ సింగ్‌పై శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) అధినేత సిమ్రన్‌జిత్‌సింగ్‌ మాన్‌ 5,822 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఆప్‌ తరఫున భగవంత్‌ మాన్‌ గెలుపొందారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సంగ్రూర్‌లో తాజాగా కాంగ్రెస్‌ మూడో స్థానానికి, అకాలీదళ్‌ అయిదో స్థానానికి పరిమితమయ్యాయి. స్వతంత్ర సిక్కు రాష్ట్రం ఏర్పాటుకు బహిరంగంగా మద్దతు పలికే సిమ్రన్‌జిత్‌సింగ్‌ ప్రస్తుతం విజయం సాధించడంతో పంజాబ్‌లో మళ్లీ వేర్పాటువాదం ఊపందుకుంటుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

త్రిపురలో కమలం హవా

త్రిపురలోని టౌన్‌ బర్డోవాలీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా (భాజపా) విజయం సాధించారు. చాన్నాళ్లుగా తమకు కంచుకోటగా ఉన్న జుబరాజ్‌నగర్‌ను సీపీఎం కోల్పోయింది. అక్కడ భాజపా అభ్యర్థి మలీనా దేబ్‌నాథ్‌ చేతిలో సీపీఎం అభ్యర్థి శైలేంద్ర చంద్రనాథ్‌ పరాజయం పాలయ్యారు. సుర్మాలో స్వప్నదాస్‌ (భాజపా) విజయకేతనం ఎగరేశారు. అగర్తలాలో కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌రాయ్‌ బర్మాన్‌ గెలుపొందారు. త్రిపురలో బలపడాలని చూస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాల వెల్లడి అనంతరం భాజపా, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య కాంగ్రెస్‌భవన్‌ ఎదుట ఘర్షణలు చెలరేగాయి. కార్యకర్తలు పరస్పరం రాళ్లు, ఇటుకలు రువ్వుకున్నారు. ఈ ఘటనలో త్రిపుర పీసీసీ అధ్యక్షుడు బిరాజిత్‌ సిన్హా సహా 19 మంది గాయపడ్డారు. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది.

* దిల్లీలోని రాజిందర్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని ఆప్‌ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి దుర్గేష్‌ పాఠక్‌ సమీప ప్రత్యర్థి రాజేష్‌ భాటియా (భాజపా)పై 11 వేలకుపైగా ఓట్ల తేడాతో జయభేరి మోగించారు.

* ఝార్ఖండ్‌లోని మందార్‌ అసెంబ్లీ స్థానంలో గంగోత్రికుజుర్‌ (భాజపా)పై శిల్పి నేహా టిర్కీ (కాంగ్రెస్‌) 23,517 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


చరిత్రాత్మక విజయం: మోదీ

రాంపుర్‌, ఆజంగఢ్‌లలో భాజపా గెలుపును చరిత్రాత్మక విజయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వానికి యూపీ ప్రజల మద్దతును తాజా ఫలితాలు చాటిచెప్తున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. త్రిపురలో తమ పార్టీపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఝార్ఖండ్‌, దిల్లీ, పంజాబ్‌ల్లోనూ భాజపాకు ఓటేసినవారందరికి ధన్యవాదాలు తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts