కొల్లాపూర్‌లో హైడ్రామా

తెరాస నేతలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిల సవాళ్లు, ప్రతి సవాళ్లతో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. చర్చలకు జూపల్లి ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా పోలీసులు ఆయనను

Updated : 27 Jun 2022 06:52 IST

 రోజంతా ఉద్రిక్తత

జూపల్లి, బీరం సవాళ్లు, ప్రతిసవాళ్లు

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే.. కొద్దిసేపటికి విడుదల

కొల్లాపూర్‌, కొల్లాపూర్‌ పట్టణం, పెంట్లవెల్లి, న్యూస్‌టుడే: తెరాస నేతలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిల సవాళ్లు, ప్రతి సవాళ్లతో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. చర్చలకు జూపల్లి ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం వరకు ఇంటి వద్ద వేచిచూసి జూపల్లి హైదరాబాద్‌ వెళ్లారు. ఎమ్మెల్యే సైతం రాజధానికి వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులేమిటంటే.. పాలమూరు రంగారెడ్డి పథకంలో భాగంగా అంజనగిరి జలాశయంలో కేఎల్‌ఐ డి5 కాల్వ ముంపునకు గురవుతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎందుకు తొలగిస్తున్నారని ఇటీవల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన వ్యక్తం చేసి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. జూపల్లి హయాంలోనే కాల్వ సైజు తగ్గించి చివరి ఆయకట్టుకు నీరందకుండా చేశారని ఎమ్మెల్యే ప్రత్యారోపణ చేశారు. ఈ నెల 14న జూపల్లి స్పందిస్తూ.. 26న చర్చలకు కొల్లాపూర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాకు రావాలని ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు. మీ ఇంటికే వచ్చి చర్చిస్తానని ఎమ్మెల్యే ప్రతి సవాల్‌ చేయడంతో కొల్లాపూర్‌లో హైడ్రామా నెలకొంది.

అభివృద్ధికి అడ్డువస్తే ఖబడ్డార్‌: బీరం

ఉదయం 10 గంటల తర్వాత ఎమ్మెల్యే తన వర్గీయులతో మాజీమంత్రి ఇంటికి బయలుదేరగా అంబేడ్కర్‌ చౌరస్తాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ వాహనంలో ఆయనను మొదట పట్టణంలోని ఠాణా, తర్వాత పెద్దకొత్తపల్లి, కోడేరు మీదుగా వనపర్తి జిల్లా పరిధిలోని పెబ్బేరుకు తరలించి విడిచిపెట్టారు. అక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావుది ఫ్యాక్షన్‌ సంస్కృతి అని..నియోజకవర్గ అభివృద్ధికి అడ్డు వస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడే సింగోటం పరిహారం తీర్పు వచ్చిందన్నారు. చర్చలకు ఆయనింటికెళ్తుంటే పోలీసులు అరెస్టు చేశారన్నారు. కాందిశీకుల భూమిని కుదువబెట్టి రూ.60 కోట్లు అప్పు చేయడం, ఓ బ్యాంక్‌లో రుణాన్ని ఓటీఎస్‌ కింద చెల్లించడం ప్రజాప్రతినిధిగా తప్పు కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

అరెస్టు పేరుతో ఎమ్మెల్యే పారిపోయారు: జూపల్లి

మరోపక్క మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఉదయం 12 గంటల వరకు వేచి చూసి కొల్లాపూర్‌లోని ఇంటి దగ్గర తన వర్గీయులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. అరెస్టు పేరుతో ఎమ్మెల్యే పారిపోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై వాస్తవాలను వివరించడానికి సిద్ధంగా ఉన్నా రాలేదన్నారు. అనంతరం మాజీమంత్రి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పెబ్బేరు నుంచి కొల్లాపూర్‌లోని తన ఇంటికి వచ్చి ఆ తర్వాత రాజధాని వెళ్లారు. కొల్లాపూర్‌లో పరిస్థితిని ఎస్పీ మనోహర్‌ పర్యవేక్షించారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ రామేశ్వర్‌, డీఎస్పీ మోహన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీఐలు, ఎస్సైలు.. ఎమ్మెల్యే, మాజీమంత్రి ఇళ్ల వద్ద బందోబస్తు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని